ఎన్నికల్లో ఓటమితో బీజేడీలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. నాలుగు దఫాలుగా ఒడిశా రాజకీయాల్లో పాలకపక్షంగా ఉన్న బీజేడీ ఈ సారి ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో ఆ పార్టీ నాయకత్వంలో మార్పులు జరుగుతున్నాయి.
బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కోటరీలో కీలకంగా వ్యవహరించే వీకే పాండియన్ సంచలన ప్రకటన చేశారు. క్రీయాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన పాండియన్, ఓ వీడియో విడుదల చేశారు. రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిన ఆయన తన రాజకీయ ప్రయాణంలో ఎవరినైనా గాయపరిస్తే క్షమించాలని కోరారు. తనపై జరిగిన ప్రచారం వల్లే పార్టీ ఓడినట్లు భావిస్తే మన్నించాలన్నారు. తాను చిన్న గ్రామం నుంచి వచ్చినట్లు తెలిపిన పాండియన్ ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయడమే తన స్వప్నమన్నారు. పూరీ జగన్నాథుని ఆశీస్సులతో అది సాధించగల్గానన్నారు. తమ కుటుంబం ఒడిశాలోని కేంద్రపరకు చెందినది కావడం వల్లే ఉద్యోగంలో భాగంగా ఆ రాష్ట్రానికి వెళ్ళినట్లు చెప్పారు.