ఖలిస్థాన్ మద్దతుదారుల చేష్టలపై కెనడా ప్రభుత్వం సీరియస్ అయింది. కొందరు ఖలిస్థాన్ మద్దతుదారులు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య చిత్రాలను ప్రదర్శించడంపై కెనడా మంత్రి డొమనిక్ ఎల్ లిబ్లెన్స్ తీవ్రంగా హెచ్చరించారు. హింసను ప్రేరేపించే కార్యక్రమాలు మానుకోవాలని వ్యాఖ్యానించారు. హింసను ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. కెనడాలోని వాంకోవర్ నగరంలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఇందిరాగాంధీ హత్య ఫోటోలను ప్రదర్శించడాన్ని కెనడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
ఖలిస్థాన్ మద్దతుదారులు కెనడాలోని హిందువుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆ దేశ ఎంపీ చంద్ర ఆర్య అభిప్రాయపడ్డారు. గతంలో చేసిన కుట్రకు ఇది కొనసాగింపులా ఉందన్నారు. ఖలిస్థాన్ తీవ్రవాది పన్నూ గతంలో కెనడాలోని హిందువులు భారత్ వెళ్లిపోవాలని హెచ్చరించిన సంగతి తెలిసిందే. పన్నూలాంటి వారిపై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఇలాంటి వ్యాఖ్యలు ప్రమాదకరంగా మారే అవకాశముందని ఎంపీ చంద్రఆర్య ఆందోళన వ్యక్తం చేశారు.