నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయడానికి అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఇవాళ సాయంత్రం 7 గంటల 15 నిమిషాల నుంచి 8 గంటల మధ్య కార్యక్రమం జరగనుంది. మోదీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధినేతల్లో కొందరు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. 8 వేల మంది వీవీఐపీలు హాజరుకానున్నారు. తాజాగా గెలిచిన ఎంపీలతోపాటు, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కీలక నేతలు మోదీ ప్రమాణ స్వీకారానికి రానున్నారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరుకానున్నారు.
మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం తరవాత 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని తెలుస్తోంది. ఎన్డీయే కూటమిలో టీడీపీకి 2, జేడీయూకి 2 మంత్రి పదవులు దక్కే అవకాశ ముంది. త్వరలో మంత్రి వర్గ విస్తరణలో మిత్రపక్షాలకు మరిన్ని మంత్రుపదవులు దక్కే అవకాశముంది. కీలక మంత్రి పదవులైన రక్షణ, హోం, ఆర్థిక, రైల్వేలు, విదేశీ వ్యవహారాలు, ఉపరితల రవాణా శాఖలు బీజేపీ ఎంపీలకు దక్కనున్నాయని తెలుస్తోంది. మిత్రపక్షం టీడీపీకి ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం అందుతోంది. టీడీపీ అధినేత కూడా మంత్రి పదవుల కోసం ఒత్తిడి చేయడం లేదని సమాచారం. రాజధాని లేని రాష్ట్రం కావడంతో పట్టణాభివృద్ధి శాఖ కేటాయించే అవకాశముందనే ఊహాగానాలు నడుస్తున్నాయి.
మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు అందుకున్న బంగ్లాదేశ్, మల్దీవుల అధినేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. సార్క్ దేశాల నేతలు అందరూ సరిహద్దు దేశాల అధినేతలు కావడంతో ఇవాళ సాయంత్రానికి అందరూ ఢిల్లీకి చేరుకోనున్నారు.