ఇండోనేషియాలో ఘోరం జరిగింది. ఓ మహిళను కొండచిలువ మింగింది. మధ్యఇండోనేషియాలోని కల్లెపాగ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం…
45 సంవత్సరాల పరీదా అర్థరాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో గ్రామస్థులు గ్రామ పెద్దకు విషయం చెప్పారు. గ్రామ పెద్ద సవుర్ధి రోసి సహా పలువురు గాలించినా ఫలితం దక్కలేదు.
కొన్ని గంటల తరవాత ఓ ప్రాంతంలో భార్య చెప్పులు గమనించిన భర్త గ్రామ పెద్దకు తెలపడంతో అందరూ కలసి మరోసారి పరిసరాలను గాలించారు. సమీపంలో ఓ పెద్ద కొండచిలువ పెద్ద పొట్టతో కనిపించింది. దాని పొట్టకోసి చూడగా పరీదా చనిపోయి కనిపించింది. ఆమె వస్త్రాలు అప్పటికి ఇంకా చెక్కు చెదరలేదని గ్రామపెద్ద చెప్పారు.దాదాపు 16 అడుగుల కొండచిలువ పరీదాను మింగిందని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు.
ఇండోనేషియాలో కొండచిలువలు మనుషులను మింగడం తరచుగా జరుగుతోంది. గతంలో కూడా ఓ 24 అడుగుల కొండచిలువ 8 సంవత్సరాల బాలుడిని మింగింది. 2018లో ఓ రైతును కొండచిలువ అమాంతం మింగిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.