వైద్య విద్యలో ప్రవేశానికి ఏటా దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షా ఫలితాలను వివాదాలు చుట్టుముడుతున్నాయి. నీటీ యూజీ 2024 ఫలితాల్లో 67 మందికి మొదటి ర్యాంక్ ప్రకటించడం వివాదానికి కారణమైంది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతోపాటు, కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీనిపై కేంద్ర విద్యాశాఖ స్పందించింది. నీట్ గ్రేస్ మార్కుల సమీక్షకు కమిటీని నియమించింది.
నీట్ గ్రేస్ మార్కుల సమీక్షకు యూపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ అధ్యక్షతన నలుగురు సభ్యులతో కేంద్రం కమిటీని నియమించింది. దాదాపు 1500 విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను ఈ కమిటీ సమీక్షిస్తుందని నీట్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ డీజీ సుభోధ్ కుమార్ సింగ్ మీడియాకు వెల్లడించారు.
కమిటీ సమీక్ష చేసిన తరవాత నీట్ మార్కులు సవరించే అవకాశముందని సుభోధ్ కుమార్ ప్రకటించారు. అయితే ఇది మెడికల్ సీట్ల భర్తీపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలను ఆయన ఖండించారు. పాఠ్యాంశాల్లో వచ్చిన మార్పులు, విద్యార్థులు పరీక్షలో సమయం కోల్పోవడం వల్ల వచ్చిన గ్రేస్ మార్కుల వల్ల ర్యాంకులు మారాయని సుభోధ్ స్పష్టం చేశారు. కమిటీ రిపోర్టు పరిశీలించిన తరవాత తదుపరి నిర్ణయం ఉంటుందని ఆయన వెల్లడించారు.