నరేంద్ర మోడీ జూన్ 9(ఆదివారం)నాడు మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఎన్డీయే కూటమికి మెజారిటీసీట్లు రావడంతో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీఏ ఎంపీలంతా కలిసి మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. దాంతో ఆయన మూడోసారి పీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు.
ప్రమాణస్వీకార కార్యక్రమంలో దేశవిదేశాలకు చెందిన ప్రముఖలు పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో దిల్లీ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న తొలి వ్యక్తిగా నరేంద్రమోదీ రికార్డు సృష్టించనున్నారు.
రాష్ట్రపతి భవన్ పరసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటు దిల్లీని నో ఫ్లై జోన్‌గా కూడా ప్రకటించారు. డ్రోన్లు, పారా గ్లైడర్లు, ఎయిర్ బెలూన్స్ ఎగురవేయకుండా ఆంక్షలు విధించారు. మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, సీచెల్లెస్, మాల్దీవ్స్ దేశాధినేతలు రానున్నారు.