నీట్ యూజీ 2024 ఫలితాలను వివాదాలు చుట్టుముట్టాయి. ఫలితాలు వెలువడిన తరవాత, విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనేక మంది కోర్టుల్లో కేసులు వేశారు. మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన నీట్ ఫలితాల్లో మొదటి ర్యాంక్ 67 మందికి రావడం, ఒకే క్యాంపస్లో రాసిన 8 మందికి ఒకే మార్కులు రావడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి.
నీట్ పరీక్ష పేపర్ల వాల్యూవేషన్ మరలా చేసేలా ఆదేశించాలంటూ శివాంగీ మిశ్రా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నీట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలు రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రజలకు కల్పించిన అందరూ సమానులే అనే హక్కుకు భంగం కలిగించే విధంగా ఉందంటూ మిశ్రా పిటిషన్లో పేర్కొన్నారు.
నీట్ ప్రశ్నాపత్రంలో వచ్చిన తప్పులపై కూడా కొందరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఒక ప్రశ్నకు ఒక సమాధానం మాత్రమే ఖచ్ఛితమైందని సూచనల్లో ఇచ్చి…ఓ ప్రశ్నకు రెండు సమాధానాల్లో ఏదైనా ఖచ్ఛితమేనంటూ తరవాత పేపర్లు వాల్యూయేషన్ చేయడంపై కోర్టులో పిటిషన్ వేశారు. అసలు అలాంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వని వారికి కూడా సమాన మార్కులు వేయడంపై కోర్టులో కేసు దాఖలైంది.