ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కువ సీట్లు గెలవలేకపోయింది. బీజేపీయేతర పార్టీలకు ముస్లిములు ఏకపక్షంగా మద్దతివ్వడంతో ఎన్డీయే కూటమి పక్షాలు దెబ్బతిన్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా దాదాపు అదే పరిస్థితి.
మహారాష్ట్రలో ఎన్డీయేలో భాగంగా ఉన్న బీజేపీ 9 సీట్లు, శివసేన 7 సీట్లు, ఎన్‌సిపి 1 సీటు గెలుచుకున్నాయి. ఇండీ కూటమిలో భాగంగా ‘మహా వికాస్ అఘాడీ (ఎంవిఎ)’ పేరుతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ 13, శివసేన(యుబిటి) 9, ఎన్‌సిపి(ఎస్పి) 8 సీట్లు సాధించి రాష్ట్రంపై పట్టు నిలుపుకున్నాయి. రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఓటు వేయడం వల్లనే ఎంవిఎ 30 సీట్లు సాధించగలిగింది.
మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ జూన్ 6న, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ ముస్లిం నాయకులు ఫత్వాలు జారీ చేసారని వెల్లడించారు. దాని ఫలితంగానే ఇండీ కూటమి పార్టీలు గరిష్ట సంఖ్యలో విజయాలు సాధించాయని వివరించారు. ముంబై, సాంగ్లి, బారామతి, శిరూర్, దిండోరి వంటి నియోజకవర్గాల్లోనూ ఆ ఫత్వాలే ఎన్‌డిఎను ఓడించాయని విశ్లేషించారు.
ఉద్ధవ్ థాక్రే కాంగ్రెస్ పంచన చేరడంతో శివసేనలో చీలిక వచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఉద్ధవ్ థాక్రే హిందుత్వ సిద్ధాంతాన్ని పూర్తిగా వదిలిపెట్టేసారని ముస్లిం ఓటర్లు విశ్వసించారు. ‘ఎంవిఎ కూటమికే ఓటేయాలంటూ ఫత్వాలు జారీ చేయడం ఉద్ధవ్ థాక్రే శివసేనకు సాయపడింది. ముస్లిం ఓట్లు పడకపోతే శివసేన అభ్యర్ధులు లక్ష నుంచి లక్షన్నర ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారు’ అని దీపక్ కేసర్కర్ వివరించారు.
ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు ముంబై వాసులు, మరాఠీ ఓటర్ల మద్దతు లభించింది. అయితే నరేంద్ర మోదీ విశ్వసనీయతను దెబ్బ తీయడానికి పాకిస్తాన్లో కుట్ర పన్నారని దీపక్ కేసర్కర్ ఆరోపించారు. ‘‘పాకిస్తాన్‌లోని ఇద్దరు మంత్రులు మోదీని ఓడించాలంటూ ఎంవిఎ కూటమికి పిలుపునిచ్చారు. వారి మాటలకు కొందరు ప్రభావితమయ్యారు’’ అని దీపక్ కేసర్కర్ చెప్పారు. ఇంక, మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ ప్రతిపక్షాలు చేసిన అబద్ధపు ప్రచారం ముస్లిములపై ప్రభావం చూపాయి.
పుణేలో మే 2న కుల్ జమాతీ తంజీమ్ సంస్థ ‘తక్రీర్ బై హజ్రత్ మౌలానా సజ్జాద్ నోమానీ’ పేరిట కార్యక్రమం ఏర్పాటు చేసింది. అక్కడ, ఇండీ కూటమి సభ్య పార్టీల అభ్యర్ధులకు మాత్రమే ముస్లిములు ఓటు వేయాలని తీర్మానించారు. ఆ తీర్మానానికి అనుగుణంగా పుణే, దాని పరిసర ప్రాంతాల్లో మే 7న ముస్లిం మతపెద్దలు ఫత్వాలు జారీ చేసారు. పుణే, శిరూర్, బారామతి, మవాల్ వంటి నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్ధులకు మాత్రమే ఓటు వేయాలంటూ వారి పేరు మీద ముస్లిములకు ఆదేశాలిచ్చారు.
పుణేలో కాంగ్రెస్ అభ్యర్ధి రవీంద్ర దంగేకర్, బారామతిలో ఎన్‌సిపి(ఎస్పి) అభ్యర్ధి సుప్రియా సూలే, శిరూర్‌లో ఎన్‌సిపి(ఎస్పి) అభ్యర్ధి అమోల్ కోలే, మావళ్లో శివసేన(యుబిటి) అభ్యర్ధి సంజయ్ వాఘరేలకు ఓటు వేయాలంటూ వారు ప్రకటించారు. ఆ నలుగురు అభ్యర్ధులకే ముస్లిములు ఓటు వేయాలని, తమ కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితుల చేత ఓట్లు వేయించాలనీ కార్యక్రమ నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇస్లాం మత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతీ ముస్లిం ఓటరూ జాగ్రత్తగా ఓటు వేయాలన్నారు. ఒకవేళ మోదీ మరోసారి గెలిస్తే అన్ని మజార్లు, మదరసాలను ధ్వంసం చేస్తారనీ ఆయన హెచ్చరించారు.
మౌలానా సజ్జాద్ నోమానీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వీడియో బాగా వైరల్ అయింది. ‘‘మీరు మీ హక్కును సరైన దిశలో వాడుకోకపోతే, దేశంలోకి రోహింగ్యాల రాకను మరచిపోవలసిందే. ఈ దేశపు నాయకుడి ప్రణాళిక ప్రకారం వక్ఫ్ పద్ధతికి దేశంలో తెర పడిపోతుంది. మన మదరసాలు, మజీదులు, మజార్లను రక్షించగలిగేది మీరే. మోదీ వేసిన ఈ ఒక్క ప్రణాళిక మొత్తం ముస్లిం సమాజాన్ని పెను ప్రమాదంలో పడవేస్తుంది’’ అంటూ నోమానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లిములను రెచ్చగొట్టడం ఆ వీడియోలో స్పష్టంగా ఉంది.
ఆ వాదనలు నిజమే అన్నట్లుగా ముంబైలో జరిగిన శివసేన(యుబిటి) ర్యాలీలో ఇస్లామిక్ జెండాలు ఎగిరాయి. శివసేన చీలిక తర్వాత ఉద్ధవ్ థాక్రే వర్గం ముస్లిముల మద్దతు కోసం కష్టపడింది. వారికి వ్యతిరేక అంశాలపై మాట్లాడకుండా నిగ్రహం చూపింది. 2020లో పాల్ఘార్ సాధువుల హత్య, లౌడ్స్పీకర్లలో అజాన్‌కు వ్యతిరేకంగా రాజ్ థాక్రే హెచ్చరికల వంటి విషయాల్లో ఉద్ధవ్ థాక్రే నోరెత్తి మాట్లాడలేదు. ఫలితంగా ఎన్నికల్లో బీజేపీ 9సీట్లకు పరిమితం కావలసి వచ్చింది.
ముంబైలో శివసేన(యుబిటి) ర్యాలీలో ఆకుపచ్చ జెండా ఎగిరింది. తొలుత దాన్ని పాకిస్తాన్ జెంలుగా భావించారు. కానీ అది ఇస్లామిక్ జెండా మాత్రమే. శివసేన (యుబిటి) కార్యకర్తలు, ముస్లిం మద్దతుదారులు కలిసి ఇస్లామిక్ జెండాను ఎగురవేసారు. దాంతో ఉద్ధవ్ థాక్రే హిందుత్వ సిద్ధాంతం నుంచి పూర్తిగా బైటకు వచ్చేసాడన్నట్టుగా ముస్లిములకు సంకేతాలు వెళ్ళాయి.
ఆల్ ఇండియా ముస్లిం పెర్సనల్ లా బోర్డ్ సహా రాష్ట్రంలోని మసీదులు చేసిన ప్రచారం, జారీ చేసిన ఫత్వాలు, ముస్లిం సమాజం మద్దతు మహారాష్ట్ర రాజకీయాన్ని ఇండీ కూటమికి అనుకూలంగా మార్చేసాయి. అలా జరగని పక్షంలో ఎన్‌డిఎ కూటమి మహారాష్ట్రలో కనీసం మరో పదికి పైగా నియోజకవర్గాల్లో విజయం సాధించి ఉండేది.