ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ 12 ఉదయం 11.27గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వేదికగా ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది.
చంద్రబాబుతో పాటు పదిమంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వత మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా అదే రోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా ఎన్డీయే ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అమరావతిలో నిర్వహించాలని టీడీపీ యోచించింది. కానీ స్థలం సమస్యగా మారడంతో గన్నవరం ఐటీ పార్క్ ను ఎంచుకున్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ముఖ్య అధికారులు గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ ను సందర్శించారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జూన్ 11న టీడీపీ శాసనసభా పక్షనేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు.