మీడియా దిగ్గజం, ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయనకు గుండె ఆపరేషన్ నిర్వహించి స్టంట్ వేశారు. అప్పటి నుంచి ఆయన కోలుకుంటున్నారని డాక్టర్లు భావించారు. ఇవాళ తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి రామోజీరావు తుదిశ్వాస విడిచారు.
రామోజీరావు 1936, నవంబరు 16న కృష్ణా జిల్లా గుడవాడ సమీపంలోని పెదపారుపూడిలో జన్మించారు. విద్యాభ్యాసం గుడివాడలో కొనసాగించారు. ఆయన బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన తరవాత ముంబైలోని ఓ యాడ్ ఏజన్సీలో కొంత కాలం పనిచేశారు. తరవాత పచ్చళ్ల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మార్గదర్శి చిట్స్‌తో దక్షిణాది రాష్ట్రాలకు పరిచయం అయ్యారు. ఇక 1974లో ఈనాడు పత్రికను ప్రారంభించి మీడియారంగంలో తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగారు.
రామోజీరావు ఆకస్మిత మృతిపట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ద్రి
దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. రామోజీరావు అంటే సమయపాలన, క్రమశిక్షణ అంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. రామోజీరావు భవిష్యత్ తరాలకు దిక్ఛూచిగా నిలిచాడని బీజేపీ సీనియర్ నేత, గవర్నర్ దత్తాత్రేయ సంతాపం తెలిపారు.
పద్మవిభూషన్ రామోజీరావుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రామోజీరావు మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సందర్శకుల కోసం రామోజీరావు మృతదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసంలో ఉంచారు. ఇవాళ సాయంత్రం ఆయన అంత్యక్రియలు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్నారు.