వరుసగా నాలుగో రోజూ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. కేంద్రంలో స్థిరమైన ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతోందన్న బలమైన సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు భారీగా స్టాక్స్ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిల్టెల్, హెరిటేజ్‌ఫుడ్స్ షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్, నిప్టీ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.
ప్రారంభంలోనే సెన్సెక్స్ లాభాలతో మొదలైంది. అదే ట్రెండ్ చివరి వరకు కొనసాగింది. ఒక సమయంలో 76795 పాయింట్ల లైఫ్ టైం రికార్డులను తాకింది. చివరకు 1618 పాయింట్ల లాభంతో, 76693 వద్ద ముగిసింది. నిఫ్టీ 468 పాయింట్లు పెరిగి 23290 వద్ద క్లోజైంది. డాలరుతో రూపాయి స్వల్పంగా బలపడి 83.38 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా భారీగా లాభపడ్డాయి. ముడిచమురు ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 79.92కు పడిపోయింది.