ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి చెందిన హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచే సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో 17 ప్రైవేటు లిక్కర్ తయారీ కంపెనీలను స్వాధీనం చేసుకుని, అనేక బ్రాండ్లు తయారు చేసి, వాటి ధరలు విపరీతంగా పెంచి, నగదు విక్రయాలు చేసి వేలకోట్లు కాజేశారనే ఆరోపణల నేపథ్యంలో సీఐడీ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఏపీలో లిక్కర్ అమ్మకాల్లో కేవలం నగదు లావాదేవీలు నిర్వహించడంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మిన సరకునకు, చూపిన లెక్కలకు చాలా తేడాలున్నాయని సీఐడి అధికారులు గుర్తించారు. బేవరేజస్ కార్పొరేషన్ ఆదాయాన్ని తాకట్టుపెట్టి బ్యాంకుల నుంచి 25 వేల కోట్లు అప్పులు తెచ్చి సంబంధం లేని శాఖలకు తరలించడంపై కూడా సీఐడి అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వాసుదేవరెడ్డిని సాయంత్రానికి అరెస్ట్ చూపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.