లోక్‌సభ ఎన్నికలు ముగిసాయి. కొత్త ప్రభుత్వం కొలువుతీరబోతోంది. మొత్తం 543 మంది ఎంపీల్లో 280 మంది కొత్తగా ఎన్నికైన వారే. మన దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎంపీల వేతనాలు ఎలా ఉంటాయో తెలుసా?
పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను 2018లో సవరించారు. అప్పటినుంచీ ప్రభుత్వం ఎంపీలకు కొత్త వేతనాలను చెల్లిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
(1) ప్రతీ పార్లమెంటు సభ్యుడికి బేసిక్ శాలరీ రూ.100,000 లభిస్తుంది
(2) ప్రతీ ఎంపీకి నియోజకవర్గ భత్యం కింద నెలకు రూ.70వేలు లభిస్తుంది.
(3) ప్రతీ ఎంపీకి తన నియోజకవర్గంలో కార్యాలయ నిర్వహణకు నెలకు రూ.60వేలు ఇస్తారు
(4) పార్లమెంటు సెషన్లు, మరే ఇతర సమావేశాల కోసం ఢిల్లీ వెళ్ళే ఎంపీలకు దినబత్తెంగా రోజుకు 2వేలు ఇస్తారు.
(5) ఎంపీలు, వారి కుటుంబ సభ్యులకు దేశీయ విమానాల్లో 34ప్రయాణాలు ఉచితం. అలాగే రైళ్ళలో ఫస్ట్‌క్లాస్ ప్రయాణం కూడా ఉచితమే. వారు తమ నియోజకవర్గాల్లో రహదారి ప్రయాణాలు చేసేటప్పుడు ఇంధనానికి అయ్యే ఖర్చును మైలేజ్ చార్జెస్‌గా తీసుకోవచ్చు.
(6) ఎంపీలకు ఐదేళ్ళ కాలం పాటు అద్దె లేని ఉచిత బస ఏర్పాటవుతుంది. సభ్యుల సీనియారిటీని బట్టి, స్థాయిని బట్టి వారికి బంగ్లా, ఫ్లాట్ లేదా హాస్టల్ రూమ్ కేటాయిస్తారు. అధికారిక నివాసం అక్కర్లేదనుకునే వారికి నెలకు రూ.2లక్షల హౌసింగ్ అలవెన్స్ చెల్లిస్తారు.
(7) ఎంపీలు, వారి కుటుంబ సభ్యులకు కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఉచిత వైద్య సౌకర్యం లభిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కానీ వారికి చికిత్స ఉచితంగా చేస్తారు.
(8) ఒకసారి ఎంపీగా పదవీకాలం పూర్తి చేసుకున్నవారికి నెలకు రూ.25వేల పెన్షన్ లభిస్తుంది. ఆపై ఎన్ని సంవత్సరాలు ఎంపీగా సేవలు అందిస్తే అలాంటి ప్రతీ సంవత్సరానికీ రూ.2వేలు చొప్పున ప్రతీ నెలా అదనపు పెన్షన్ లభిస్తుంది.
(9) పార్లమెంటు సభ్యులకు ఏడాదికి 1.5లక్షల టెలిఫోన్ కాల్స్ ఉచితం. వారి నివాసాల వద్ద, కార్యాలయాల వద్ద హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉచితం.
(10) ఎంపీలకు ఏడాదికి 50వేల యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితం. 4వేల కిలోలీటర్ల నీరు కూడా ఉచితం.