మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ తెగకు చెందిన ఒక వ్యక్తిని తల నరికి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. కుకీ మిలిటెంట్లే ఆ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సొయిబం శరత్‌కుమార్ సింగ్ అనే వ్యక్తి తన పొలానికి వెళ్ళి, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళే క్రమంలో కనబడకుండా పోయాడు. తర్వాత అతని మృతదేహం లభించింది. దానిపై అడవిపంది చేసినట్లుగా గాయాలు ఉన్నాయి. అయితే అవి నిజంగా జంతువు దాడి వల్ల తగిలిన గాయాలు కావని, పదునైన ఆయుధంతో చేసిన గాయాలనీ వైద్యులు ధ్రువీకరించారు. దాన్ని బట్టి సొయిబం శరత్‌కుమార్‌ను దుండగులు దురుద్దేశంతోనే చంపారని పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు.
ఆ హత్యతో స్థానిక మెయితీలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వారు జిరిబాం పోలీస్ స్టేషన్ వరకూ మార్చ్‌ఫాస్ట్ చేసారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పోలీసులు స్వాధీనం చేసుకున్న తమ లైసెన్స్‌డ్ ఆయుధాలను వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేసారు. పరిస్థితిని అదుపులో ఉంచడానికి పోలీసులు జిల్లా అంతటా సెక్షన్ 144 విధించారు.
నిజానికి గత మే నెల నుంచి మణిపూర్‌లో జరిగిన కుకీ-మెయితీ ఘర్షణలు జిరిబాం జిల్లాపై పెద్ద ప్రభావం చూపించలేదు. ఆ జిల్లాలో మెయితీలు, ముస్లిములు, నాగాలు, కుకీలు, మణిపూర్‌కు చెందని ఇతరులు కూడా ఉన్నారు. ఇప్పుడు సొయిబం శరత్‌కుమార్ హత్యతో మెయితీల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది.