నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టబోతున్న సందర్భంలో ఆయనకు ప్రపంచ దేశాలనుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి సందేశాల్లో ఒకదానికి మోదీ ‘ధన్యవాదాలు తులసీ భాయ్’ అంటూ స్పందించారు. ఎవరా తులసీ భాయ్? ఆ విదేశీయుడికి భారతీయమైన ఆ పేరు ఎలా వచ్చింది?
ఆ వ్యక్తి అసలు పేరు టెడ్రోస్ అధానోమ్ గెబ్రెయేసుస్. ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధిపతి. తాజాగా ముగిసిన లోక్సభ ఎన్నికల్లో గెలుపు దక్కించుకుని, నరేంద్రమోదీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సందర్భంలో ఆయన మోదీకి అభినందన సందేశం పంపించారు.
‘‘మరోసారి ఎన్నికైనందుకు అభినందనలు నరేంద్రమోదీజీ. ‘అందరికీ ఆరోగ్యం’ కోసం డబ్ల్యూహెచ్ఓ, భారత్ కలిసి చేస్తున్నపని మరింత ఉత్సాహంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేసారు. దానికి జవాబుగా నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు.
‘‘మిత్రమా తులసీ భాయ్, ధన్యవాదాలు. డబ్ల్యూహెచ్ఓకు భారత్ సహకారంతో ‘ఒక ప్రపంచం ఒక ఆరోగ్యం’ అనే మన దార్శనికతకు మరింత ప్రచారం లభిస్తుంది. సాంప్రదాయిక వైద్యానికి భారత్లో డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సెంటర్, ‘అందరికీ ఆరోగ్యం’ కోసం మన ఉమ్మడి ప్రయత్నాలకు తోడుగా ఉంటుంది’’ అంటూ మోదీ జవాబిచ్చారు.
టెడ్రోస్ అధానోమ్ గెబ్రెయేసుస్కు తులసీ భాయ్ అనే పేరు రావడానికి ఆసక్తికరమైన నేపథ్యం ఉంది.
2022లో గుజరాత్లో మూడు రోజుల పాటు ‘గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్’ జరిగింది. ఆ సదస్సుకు టెడ్రోస్ హాజరయ్యారు, అక్కడే ప్రధాని మోదీని కలిసారు.
‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ నాకు మంచి మిత్రుడు. తను భారతీయ గురువుల వద్ద చదువుకున్నాననీ, వారివల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నాననీ ఎప్పుడూ చెబుతూండేవారు. ఆయుష్ సదస్సులో ఆయన నాతో మాట్లాడారు. తానిప్పుడు పక్కా గుజరాతీగా మారిపోయాననీ, తనకొక పేరు సూచించమనీ అడిగారు. అందువల్ల ఆయనకు నేను తులసీ భాయ్ అనే గుజరాతీ పేరు పెట్టాను. తులసి మొక్కను ఆధునిక తరాలు మరచిపోతున్నాయి. భారతదేశంలో ప్రాచీనకాలం నుంచీ తులసి మొక్కను పూజించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఎన్నో ఔషధ గుణాలున్న తులసిని పెళ్ళిళ్ళలో సైతం ఉపయోగిస్తారు. అందుకే టెడ్రోస్కు తులసీ భాయ్ అనే పేరు సముచితమైనది’’ అని మోదీ చెప్పుకొచ్చారు.
ఔషధ మొక్క అయిన తులసి పేరు తనకెంతో నచ్చిందని టెడ్రోస్ కూడా చెప్పారు. తనను ఆ పేరుతో పిలిస్తే ఆనందిస్తానన్నారు. ఇప్పుడు ఆయన అభినందన సందేశానికి ప్రధాని ఆ పేరుతోనే స్పందించారు.