కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఇవాళ మధ్యాహ్నం ఒక వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసారు. అది నిజానికి ఫేక్ న్యూస్. దాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగానో, మరే కారణం చేతనో రీట్వీట్ చేయడమే కాక, దానికి ఒక వ్యాఖ్య కూడా జత చేసారు. చివరికి అది నకిలీదని తేలడంతో దాన్ని తొలగించారు.
పవన్ ఖేరా షేర్ చేసిన వీడియోలో కొందరు వ్యక్తులు చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ, ఆయన పోస్టర్లను తగులబెడుతూ ఉన్న దృశ్యాలున్నాయి. దాంతోపాటు ‘నరేంద్ర మోదీకి మద్దతిచ్చినందుకు చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు, ఆయన ఫొటోలు తగులబెడుతున్నారు’ అనే వ్యాఖ్య కూడా ఉంది. దాన్న షేర్ చేస్తూ పవన్ ఖేరా ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంత కోపంగా ఉన్నారు?’ అని తన సొంత వ్యాఖ్యను కూడా జోడించారు.
అయితే కొద్దిసేపట్లోనే నెటిజన్లు అది ఫేక్ న్యూస్ అని పసిగట్టేసారు. కాంగ్రెస్ నాయకుడు ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని షేర్ చేసాడని మండిపడ్డారు. దాన్ని వెంటనే తొలగించాలని హెచ్చరించారు. మరింత నష్టం జరగకూడదని భావించిన పవన్ ఖేరా ఆ ట్వీట్‌ను తన ఎక్స్ ఖాతా నుంచి డిలీట్ చేసారు.
ఇంతకీ ఆ వీడియో కథ ఏమిటి? అది గత నెలలో వైఎస్ఆర్‌సిపి కార్యకర్తలు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆందోళన చేసినప్పటిది. అందులో వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు ఫొటోలను తగులబెట్టిన దృశ్యాలున్నాయి.
ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీయే కూటమిలో ఉన్నందున, వారిని తమవైపు లాక్కోవాలని ఇండీ కూటమి చేసిన ప్రయత్నాలు ఫలించనందున పవన్ ఖేరా ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసి టిడిపి, బిజెపి మధ్య గొడవలు రేపాలని చూసారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.