లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పశ్చిమ బెంగాల్లో ఆందోళనకర స్థాయిలో హింసాకాండ చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలను లక్ష్యం చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలు, విధ్వంసాలు చోటు చేసుకున్నాయి.
రాజ్పూర్ సోనార్పూర్ మునిసిపాలిటీలో 26వ నెంబర్ వార్డులో బీజేపీ కార్యాలయం మీద తృణమూల్ దుండగులు దాడులకు పాల్పడ్డారు. ఆ ప్రాంతంలోని మొత్తం 12లో 9 బూత్‌లలో ఓట్లు పూర్తిగా బీజేపీకి పడడమే దానికి కారణం. స్థానిక బీజేపీ కార్యకర్తలు సోనార్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. అయితే టీఎంసీ నాయకత్వం ఆ ఆరోపణలను ఖండించింది. దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏడవ దశ పోలింగ్ పూర్తయ్యాక బరాక్‌పూర్ నగరంలో బీజేపీ కార్యకర్త ఇంటిమీద, టీఎంసీ కార్యాలయం మీద నాటుబాంబులతో దాడులు జరిగాయి. వాటికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. సందేశ్‌ఖాలీ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటి గురించి బీజేపీ కార్యకర్తలు నిలదీయడంతో టీఎంసీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు.
కార్యకర్తల మధ్య ఘర్షణలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు ధ్వంసమయ్యాయి, పలువురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. ఎన్నికల్లో అక్రమాలు, పోలింగ్ బూత్‌లలోకి ఏజెంట్లను రానీయకపోవడం వంటి అంశాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్ళాయి.
బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చెప్పిన వివరాల ప్రకారం ఎన్నికల అనంతర హింసలో కనీసం 24మంది వ్యక్తులు గాయపడ్డారు. కూచ్‌బెహార్, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు వంటి జిల్లాల్లో ఘర్షణల కారణంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
నాడియా జిల్లాలో జూన్ 2న ఎన్నికల అనంతర హింసలో ఒక బీజేపీ కార్యకర్త చనిపోయాడు. ఆ తర్వాత మరో వ్యక్తి హత్య ఘటన అదే జిల్లాలో వెలుగు చూసింది. ఆ సంఘటనలపై పోలీసులు, మృతులకు రాజకీయ శత్రువులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో, దర్యాప్తు చేస్తున్నారు.
ఈ హింసాకాండ, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. బెంగాల్లో జూన్ 19 వరకూ సుమారు 400 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించింది. మరిన్న ఘర్షణలు జరగకుండా చూడడానికి, ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికీ ఈ నిర్ణయం తీసుకుంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు