ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దమైంది. ఈ నెల 9న మోదీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్, నేపాల్, మారిషస్, శ్రీలంక అధినేతలను ఆహ్వానించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు ఇప్పటికే ఆహ్వానం అందింది. రణిల్ విక్రమసింఘే హాజరవడానికి అంగీకారం తెలిపినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.
2014లో మోదీ మొదటిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో సార్క్ దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019లో బిమ్ టెక్ దేశాల అధినేతలు హాజరయ్యారు. ఇప్పటికే బుధవారంనాడు ఎన్డీయే పక్షాల నేతలు ప్రధాని నివాసంలో ఒక దఫా హాజరయ్యారు. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు టీడీపీ, జేడీయూ రాతపూర్వకంగా మద్దతు పలికాయి. 7వ తేదీ మరోసారి ఎన్డీయే కూటమి నేతలు ప్రధాని మోదీ నివాసంలో హాజరుకానున్నారు. బీజేపీకి 240 ఎంపీ సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి అయింది.