స్టాక్ మార్కెట్ల నష్టాలకు బ్రేక్ పడింది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపించడంతో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరిగాయి. తాజాగా గురువారం ఉదయం సెన్సెక్స్ 391 పాయింట్ల లాభంతో మొదలైంది. నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 22717 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి విలువ స్వల్పంగా దిగజారి 83.42 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో పవర్‌గ్రిడ్, టెక్ మహింద్రా, ఎస్బీఐ, విప్రో, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్ అండ్ టి, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
బుధవారం ఐరోపా, అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగియడం, ఇవాళ ఉదయం ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. కేంద్రంలో మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం వస్తుందన్న నమ్మకం కూడా ఇన్వెన్టర్ల దూకుడుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.