అమెరికా – వెస్టండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఉగాండా తొలి విజయాన్ని అందుకుంది. పాపువా న్యూగినియాతో గయానా వేదికగా జరిగిన మ్యాచ్లో గెలిచింది. 10 బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాపువా న్యూగినియా ఐదు బంతులు మిగిలి ఉండగానే 77 పరుగులకు ఆలౌటై పెవిలియన్ చేరింది. ఏడుగురు బ్యాటర్లు పేలవంగా ఆడారు. హిరిహిరి చేసిన 15 పరుగులే అత్యధికం, లెగా సియాకా, కిప్లిన్ డోరిగా చెరో 12 పరుగులు చేశారు. ఉగాండా బౌలర్లలో నలుగురు బౌలర్లు తలా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
ఉగాండా 78 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగగా ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత కూడా పెద్దగా రాణించలేకపోయింది. 48 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాజత్ అలీ షా ఒంటరి పోరాటం చేసి జట్టును గెలిపించాడు. 56 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టును విజయంవైపు నడిపంచాడు.