ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే అధికారపక్షంగా ఏర్పడింది. అయితే కూటమిలోని తెలుగుదేశం 135 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా ఆ పార్టీకి 1,53,84,576 మంది ఓటర్ల మద్దతుతో 45.60 శాతం ఓట్ షేర్ ను సొంతం చేసుకుంది. వైసీపీకి 1,32,84,134కి ఓట్లు పడగా ఓట్ షేర్ 39.37 శాతంగా ఉంది.
పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి 6.85 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 2.83 శాతం జైకొట్టారు. వైసీపీకి కంటే కూటమికి 53,72,166 ఓట్లు అధికంగా పడ్డాయి. టీడీపీ, వైసీపీల మధ్య తేడా 21,00,442 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. కూటమి 164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంది. టీడీపీ ఒంటరిగానే 135 అసెంబ్లీ, 16 ఎంపీ స్థానాలను గెలుచుకోగా వైసీపీ 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కూటమి మొత్తంగా 55.28 శాతం ఓట్లు పడ్డాయి. బీజేపీకి 9,53,977 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కు 580613 ఓట్లు పోల్ అయ్యాయి. 1.72 శాతానికి ఓట్ షేర్ ను హస్తం పార్టీ పెంచుకుంది.
నోటాకు 1.09 శాతం ఓట్లు పడ్డాయి. నోటాకు 369320 ఓట్లు పోల్ అయినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల్లో సీపీఎంకు 0.13 శాతం, సీపీఐకి 0.04 శాతం సీపీఐ(ఎంఎల్)(ఎల్) కు0.01 శాతం ఓట్లు పడ్డాయి. బీఎస్పీకి 0.60 శాతం ఓట్ షేర్ లభించింది. ఆ పార్టీకి 204060 ఓట్లు పడ్డాయి.