బీజేపీ నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో 293 స్థానాలు గెలుచుకున్న ఎన్డీయే కూటమి శనివారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రధానమంత్రి పదవికి నరేంద్రమోదీని కూటమి పక్షాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి.
బుధవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే కూటమి పక్షాల సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ సహా మిత్రపక్షాలన్నీ నరేంద్రమోదీ నేతృత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించాయి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి మోదీ చేస్తున్న కృషిని అభినందించాయి. వికసిత భారతదేశం అనే లక్ష్యాన్ని సాధించాలన్న మోదీ దార్శనికతలో భాగస్వాములుగా ఉంటామని వెల్లడించాయి. అంతర్జాతీయంగా భారతదేశం స్థాయిని పెంచడంలో మోదీ పాత్రను ప్రశంసించాయి.
ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధారణ మెజారిటీకి కావలసిన 272కు 32సీట్లు తక్కువగా 240 స్థానాలు సాధించింది. దాంతో 16 సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం, 12 సీట్లు గెలుచుకున్న జేడీయూ ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు మొత్తం 232 స్థానాలు సాధించిన ప్రతిపక్ష ఇండీ కూటమి, వారిద్దరినీ తమ కూటమిలోకి ఆహ్వానించే అవకాశాన్ని పరిశీలిస్తామని ప్రకటించడంతో జాతీయ రాజకీయం రసకందాయంలో పడింది.
ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ తాము ఎన్డీయే కూటమిలోనే కొనసాగుతామని స్పష్టం చేసారు. ఆ మేరకు మద్దతు లేఖలు కూడా అందజేసారు.