న్యాయస్థానాల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి నిరాశ ఎదురైంది. మధ్యంతర బెయిల్ కోసం కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థనను దిల్లీ కోర్టు తిరస్కరించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున వైద్య చికిత్స కోసం బెయిల్ ఇవ్వాలని కోర్టును కేజ్రీవాల్ కోరారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం అభ్యర్థనను తోసిపుచ్చింది. జూన్ 19 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడంతో పాటు జైలు అధికారులే కేజ్రీవాల్ వైద్య అవసరాలు చూసుకోవాలని స్పష్టం చేసింది.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది.తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ కోరగా కోర్టు అనుమతించింది. ఎన్నికల ప్రచారం అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జూన్ 2న తిరిగి జైలులో లొంగిపోయారు.