లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి బలమైన ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 48 స్థానాలకు గాను బీజేపీ కేవలం 9 స్థానాలు గెలిచింది. దాని మిత్రపక్షాలు 8 స్థానాలకు పరిమితమయ్యాయి. ఈ పేలవమైన ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని దేవేంద్ర ఫడ్నవీస్ తమ పార్టీ నాయకత్వాన్ని కోరారు.
‘‘మహారాష్ట్రలో ఎదుర్కొన్న నష్టాలకు నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. నన్ను మంత్రి బాధ్యతల నుంచి తప్పించవలసిందిగా అగ్రనాయకత్వాన్ని అర్ధిస్తున్నాను’’ అన్నారు ఫడ్నవీస్.
మహారాష్ట్రలో రైతులను ప్రభావితం చేసిన అంశాల వల్ల ఫలితాలు తలకిందులయ్యాయని ఆయన అంచనా వేసారు. అంతేకాక, ప్రతిపక్షాలు చేసిన తప్పుడు ప్రచారమూ బీజేపీని దెబ్బతీసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారనీ, రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్’ అన్న పదాన్ని తీసేస్తారనీ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. దాంతో ముస్లిములు ఏకపక్షంగా ఓట్లు వేసారు. అలాగే మరాఠా రిజర్వేషన్ ఉద్యమం కూడా ప్రభావం చూపించిందంటూ ఫడ్నవీస్ మహారాష్ట్రలో బీజేపీ ఓటమికి కారణాలను విశ్లేషించారు.