ఎన్డీయే సమావేశానికి హాజరవుతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోవడంతో ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీయూలు కింగ్ మేకర్లుగా మారారు. దీంతో ఇండీ కూటమికి చెందిన ముఖ్యనేతలు చంద్రబాబు, నితీశ్ కుమార్ తో చర్చలకు సిద్ధమైనట్లు వార్తలు వాస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాను ఎన్డీయేలోనే ఉన్నానని ఎన్డీయే మీటింగ్ కు హాజరువుతున్నట్లు స్పష్టం చేశారు. తన సుదీర్ష రాజకీయ జీవితంలో ఎన్నో రాజకీయ పరిణామాలు చూశానన్నారు. దిల్లీ పర్యటన తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు.
తాను చాలా ఎన్నికలు చూశానన్న చంద్రబాబు, రాజకీయాల్లో ఒడిదుడుకులు సర్వ సాధారణమన్నారు. రాజకీయ పార్టీలు సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారన్నారు. ఇంతటి చారిత్రక ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.