ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభలో తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించారు. వరుసగా మూడోసారీ వారణాసి నుంచి గెలిచి హ్యాట్రిక్ రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్‌రాయ్ మీద 1,52,513 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
నరేంద్రమోదీ 2014లో తొలిసారి వారణాసి నుంచి పోటీ చేసారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్‌రాయ్‌ని తొలిసారి ఓడించారు. 2019లోనూ అదే ఫలితం పునరావృతం చేసారు. వారణాసి ఎంపీగా తన పదవీకాలంలో ప్రధాని మోదీ కాశీని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఆయన పదవీకాలంలోనే కాశీ విశ్వనాథ ధామ్ నిర్మాణం జరిగింది.
వారణాసిలో మోదీ హయాంలో రుద్రకాశీ సెంటర్ ఏర్పాటు, మెడికల్ హబ్ ఏర్పాటు, విమానాశ్రయం నవీకరణ, కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం వంటి ప్రాజెక్టులు సాకారమయ్యాయి. స్థానికంగా గణనీయమైన సంఖ్యలో ఉన్న చేనేత కార్మికుల కోసం అనేక పథకాలు అమలు చేసారు. వారిలో అత్యధిక సంఖ్యాకులు ముస్లిములు కావడం గమనార్హం.
నరేంద్రమోదీ వారణాసి నియోజకవర్గం నుంచి 2014లో 56.37శాతం ఓట్లు గెలుచుకున్నారు. 2019లో ఆయన ఓట్ల శాతం రికార్డు స్థాయిలో 63.62శాతానికి పెరిగింది. ఇప్పుడు 54.24శాతం ఓట్లు సాధించారు.