సార్వత్రిక ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్ మదుపరులను భారీ నష్టాల్లోకి నెట్టింది. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం కనిపించకపోవడంతో పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు తెగబడ్డారు. ఓ సమయంలో 6 వేలకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ తరవాత కొద్దిగా కోలుకుంది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద నష్టం నమోదైంది. ఒక్కరోజే మదుపర్లు రూ.30లక్షల కోట్లు నష్టపోయారు.
ప్రారంభంలోనే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 3 వేల పాయింట్లు, నిఫ్టీ 1100 పాయింట్ల నష్టంతో మొదలైంది. తరవాత కూడా నష్టాలకు బ్రేక్ పడలేదు. ఒక సమయంలో సెన్సెక్స్ 6 వేల పాయింట్లు నష్టపోయింది. తరవాత స్వల్పంగా కోలుకుంది. నిఫ్టీ కూడా భారీ నష్టాలను మూటగట్టుకుంది.
మార్కెట్లు ముగిసే సమయానికి కు 4390 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 70285 వద్ద ముగిసింది. నిఫ్టీ 1379 పాయింట్ల నష్టంతో 21884 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో హెచ్‌యూఎల్, టీసీఎస్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి.