సార్వత్రిక ఫలితాలు స్టాక్ మార్కెట్లను నిరాశ పరిచాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సోమవారం దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు, ఫలితాల ట్రెండ్స్ మొదలు కాగానే భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 3 వేల పాయింట్లు పైగా నష్టపోయింది. సోమవారం 2 వేల పాయింట్లు పైగా లాభాలను ఆర్జించిన సూచీలు, ఇవాళ 3 వేల పాయింట్లు కోల్పోయి 73211 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 1100 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది
బీజేపీకి ఊహించిన విధంగా మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో స్టాక్ మార్కెట్ల పతనానికి దారి తీశాయి. ఎన్డీయే కూటమి 380పైగా సీట్లు సాధిస్తుందన్న అంచనాలు తారుమారుకావడంతో, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగారు. సోమవారం స్టాక్ వాల్యూ ఒకే రోజు 12 లక్షల 50 వేల కోట్లు లాభపడింది. ఇవాళ ఒక్క రోజే 14 లక్షల కోట్లు కోల్పోయాయి. సాయంత్రానికి స్టాక్ మార్కెట్లు కొంత పుంజుకునే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.