ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో కీలక ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు జొ బైడెన్ ఒత్తిడి మేరకు ఆరు వారాలు యుద్దం ఆపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అంగీకరించారు. బందీల విడుదల కోసమే యుద్ధం ఆపుతున్నామన్నారు. హమాస్ అంతం చూసే వరకు వెనక్కు తగ్గేది లేదని నెతన్యాహు తేల్చి చెప్పారు. మూడు లక్ష్యాలతో పనిచేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని తెలిపారు. హమాస్ అంతం, బందీల విడుదల, పాలస్తీనాలో శాంతి స్థాపన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నెతన్యాహు స్పష్టం చేశారు.
తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 11 మంది చనిపోయారని పాలస్తీనా ప్రకటించింది. బందీల్లో నలుగురిని హమాస్ ఉగ్రవాదులు చంపారని, ఒకరి మృతదేహం లభ్యమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానం హెచ్చరికలు, అమెరికా ఆందోళనతో ఇజ్రాయెల్ ఆరు వారాలపాటు కాల్పుల విరమణకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.