వరుసగా రెండుసార్లు పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న ఎన్‌డిఎ మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి సరిపడా సాధారణ మెజారిటీని సాధించగలిగింది. తద్వారా జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి గద్దెనెక్కుతున్న ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రికార్డు సృష్టించారు.
నిజానికి 2019 లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 303 సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి మ్యాజిక్ ఫిగర్ 272 కంటె తక్కువగా 240 దగ్గరే ఆగిపోయింది. అయితే మిత్రపక్షాలతో కలుపుకుని ఎన్‌డిఎ కూటమి సాధారణ మెజారిటీ కంటె కొంచెం ఎక్కువగా 292 స్థానాలు సాధించే దిశగా పయనిస్తోంది. అదే సమయంలో బీజేపీ సొంత ఓట్‌షేర్ దాదాపు యథాతథంగా ఉండడం, ఆ పార్టీ పట్ల ప్రజల విశ్వాసంలో మార్పు లేదని సూచిస్తోంది.
ఈ పరిస్థితిలో నరేంద్రమోదీ విభిన్నమైన భావజాలాలు కలిగిన మిత్రపక్షాల సంక్లిష్టతలతో కలిసి నడుస్తూ సుపరిపాలన అందించవలసి ఉంటుంది. అయితే ఇటువంటి సవాల్‌ను కర్ణాటక, బిహార్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఎదుర్కొన్న అనుభవం బీజేపీకి గతంలో ఉంది.
ఎన్‌డిఎ కూటమికి బలహీనపడిన ప్రజామద్దతు… భారత ప్రజాస్వామ్యపు స్థితిస్థాపకతకు సూచిక. నరేంద్రమోదీ వంటి ప్రజాస్వామిక నాయకులు ప్రజల ముందు తమను తాము పరీక్షకు పెట్టుకోడానికి ఏమాత్రం సందేహించరని, భారతదేశం నిరంకుశాధికారపు గుప్పిట్లోకి జారిపోవడం లేదని ఈ ఫలితాలు నిరూపించాయి.
కోవిడ్ మహమ్మారి వంటి సవాళ్ళు, అంతర్జాతీయ సంక్షోభాలు ఎదురైనప్పటికీ మోదీ వ్యక్తిగత విశ్వసనీయత ఇంకా చెక్కుచెదరలేదు. బీజేపీ ఓట్లశాతం స్థిరంగా ఉండడం, దేశవ్యాప్తంగా ఓటర్ల మొదటి ఎంపిక ఆ పార్టీయేనని సూచిస్తోంది.
2024 ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన దాని బలాలనూ, బలహీనతలనూ రెంటినీ చూపించింది. ఒడిషా, ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. అదే సమయంలో దాని సంప్రదాయిక కంచుకోటలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో బలహీనపడింది.
తమిళనాడులో బీజేపీ ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. కానీ 11శాతానికి పైగా ఓట్లు సాధించింది. 1989 తర్వాత ఆ రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ నేతృత్వంలోని కూటమి రెండంకెల ఓట్లశాతం సాధించడం, 9 సీట్లలో రెండోస్థానంలో నిలవడం ఇదే మొదటిసారి. అంటే బీజేపీ పట్ల అసంతృప్తి కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాలకే పరిమితమై ఉందని అర్ధమవుతుంది. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బలమైన జాతీయ అంశం ఏదీ లేని సమయంలో స్థానికాంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసాయి.
ఉత్తరాదిలోని హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీజేపీ బలహీన వర్గాల ఆదరణను కొంతవరకూ పోగొట్టుకుంది. అది ఆ పార్టీ తమ విధానాలనూ వ్యూహాలనూ సమీక్షించుకుని సరిదిద్దుకోవలసిన అవసరాన్ని సూచిస్తోంది.
అదేసమయంలో, బీజేపీ తన సొంత కార్యకర్తల ఆదరణను సైతం కొన్నిచోట్ల పోగొట్టుకుంది. విజయమే ముఖ్యమన్న భావనకు పెద్దపీట వేయడంతో సంఘ్ సాంస్కృతిక దృక్కోణంతోనూ, బీజేపీ రాజకీయ ఆదర్శ విధానంతోనూ సంబంధం లేని నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. కొన్నిచోట్ల అటువంటి చర్యలు బీజేపీ, సంఘ్ కార్యకర్తల నైతికస్థైర్యాన్ని దెబ్బతీసి ఉండవచ్చు. అది ఆ పార్టీ ప్రచార ప్రయత్నాలపై ప్రతికూల ప్రభావం చూపి ఉండవచ్చు. అందువల్ల కొత్త నాయకులను పార్టీలోకి తీసుకునే విధానాన్ని ఆ పార్టీ మళ్ళీ అంచనా వేసుకోవాలి.