బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం కేసులో తెలుగు సినీ నటి హేమను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. వంద మందికిపైగా పాల్గొన్న రేవ్ పార్టీలో దాదాపు 30 మంది డ్రగ్స్ వినియోగించారని బెంగళూరు పోలీసులు వారి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఇప్పటికే డ్రగ్స్ వినియోగం కేసులో కీలక సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు బెట్టింగ్ వాసును పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేత పూర్ణారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా విచారణ అనంతరం నటి హేమను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
నటి హేమను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జుడీషియల్ కస్టడీకి తరలించే అవకాశముంది. నటి హేమ రక్త నమూనాలు పాజిటివ్ వచ్చాయని తెలుస్తోంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసును బెంగళూరు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.