లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. జూన్ 4 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని వెల్లడించారు.
రేపటి కౌంటింగ్ ఏర్పాట్ల గురించి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇవాళ అమరావతిలో మీడియా సమావేశంలో వివరించారు. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కపెడతారని, ఆ తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కపెట్టే ప్రక్రియ మొదలవుతుందనీ మీనా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు పరిశీలకులుగా 119 మందిని ఈసీ నియమించిందని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసామన్నారు.
మన రాష్ట్రంలో మొత్తం 3.33 కోట్ల మంది ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటువేసారు. 26,473 మంది హోం ఓటింగ్ విధానం ద్వారా తమ ఇంటి దగ్గరే ఓటు వేసారు. రాష్ట్రం మొత్తం మీద 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్ళు ఏర్పాటు చేసారు. ఫలితాలు వచ్చేందుకు సుమారు 9 గంటల సమయం పడుతుంది. రాజమండ్రి, నరసాపురం లోక్‌సభలో 13 రౌండ్లుంటాయి, అక్కడ సుమారు 5 గంటల్లో ఫలితాలు వస్తాయి. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించబోమని మీనా వెల్లడించారు.