కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీద ఆరోపణలు చేయడంపై ఎన్నికల సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పుకార్లు వ్యాపింపజేయడం, ప్రతీఒక్కరినీ అనుమానించడం సరికాదని హితవు పలికింది. తనుచేసిన ఆరోపణలకు ఈరోజు రాత్రి 7గంటలలోగా ఆధారాలు అందించాలని ఆదేశించింది. వారం రోజుల సమయం కావాలన్న జైరాం రమేష్ విజ్ఞప్తిని తిరస్కరించింది.
లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత, ఓట్ల లెక్కింపు మొదలవక ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలోని 150 జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసారంటూ జైరాం రమేష్ ఆరోపించారు. ఆ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో బహిరంగ ప్రకటన చేసారు. దానికి భారత ఎన్నికల సంఘం స్పందించింది. ఆ ఆరోపణలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమకు అందజేయాలని కోరింది. అమిత్ షా ఫోన్లు చేసారని జైరాం రమేష్ చెబుతున్న 150 మంది జిల్లా కలెక్టర్లు ఎవరు, వారి వివరాలు చెప్పాలని అడిగింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ జైరాం రమేష్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ‘‘జిల్లాల కలెక్టర్లను, ఎన్నికల అధికారులను ఎవరైనా ప్రభావితం చేయగలరా? ఐదారు వందల మందిని ఒక వ్యక్తి ప్రభావితం చేయగలరా? అలా ఎవరు చేసారో చెప్పండి. ఆ వ్యక్తిని మేం శిక్షిస్తాం. ఓట్ల లెక్కింపు మొదలుపెట్టకముందే మాకు ఆ వివరాలు చెప్పండి. మీరు ఇలా పుకార్లను వ్యాపింపజేయడం, ప్రతీఒక్కరినీ అనుమానించడం సరికాదు’’ అంటూ రాజీవ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు ఎన్నో పార్టీలు పలు డిమాండ్లు చేసాయనీ, వాటన్నింటినీ పరిష్కరించామనీ రాజీవ్ కుమార్ చెప్పారు. కంట్రోల్ యూనిట్ల కదలికలను పరిశీలించడానికి సిసిటివి పర్యవేక్షణ కావాలని అడిగారని, ఆ ఏర్పాట్లు చేస్తున్నామనీ సీఈసీ చెప్పారు.
సీఈసీ అధికారులను ‘లాపతా జెంటిల్మెన్’ అంటూ ఇండీ కూటమి పార్టీల నాయకులు అపహాస్యం చేయడం పైనా రాజీవ్ కుమార్ స్పందించారు. ‘‘మేము ప్రెస్నోట్ల ద్వారా సమాచారం అందజేస్తున్నాం. పోలింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వందకు పైగా ప్రెస్నోట్లు విడుదల చేసాం’’ అని వివరించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు