సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. ఇది ప్రపంచ రికార్డు అంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు. జీ 7 దేశాల జనాభా కన్నా ఇది ఎక్కువని, యూరోపియన్ దేశాల కన్నా ఎక్కవ సంఖ్యలో ఓటింగులో పొల్గాన్నారని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగులో పాల్గొన్నారు. మొత్తం 31.2 కోట్ల మంది మహిళలు ఓటేసినందుకు వారికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
దేశంలో మొత్తం 96 కోట్ల మంది ఓటర్లుండగా వారిలో 64.2 కోట్ల మంది ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో కోటిన్నర మంది సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేకంగా 135 రైళ్లు ఏర్పాటు చేశారు. 4 లక్షల వాహనాలు ఉపయోగించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 500 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించగా, అది 2024 ఎన్నికల్లో 39కి తగ్గించగలిగారు. జమ్ము కశ్మీర్‌లో పోలింగ్ శాతం గణనీయంగా 51 శాతానికి పెరిగింది. ఎన్నికల్లో అక్రమంగా తరలిస్తోన్న 10 వేల కోట్ల నగదు సీజ్ చేశారు. 4.56 లక్షల ఫిర్యాదులురాగా 99.9 శాతం పరిష్కరించినట్లు సీఈవో తెలిపారు.