లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్యాకుమారిలోని వివేకానంద స్మారక కేంద్రంలో 45గంటల ధ్యానదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ దీక్ష పూర్తి అయాక ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెడుతూ దేశ ప్రజలను ఉద్దేశించి లేఖ రాసారు. అందులో తన ఆధ్యాత్మిక ప్రయాణం, తాజా ఎన్నికలు, దేశ భవిష్యత్తు వంటి అంశాల గురించి తన భావాలను ప్రజలతో పంచుకున్నారు. మోదీ లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి.
నా సహచర భారతీయులారా…
ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి లాంటి మన దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ, 2024 లోక్‌సభ ఎన్నికలు నేటితో ముగుస్తున్నాయి. కన్యాకుమారిలో మూడురోజుల ఆధ్యాత్మిక సాధన తర్వాత నేనిప్పుడు ఢిల్లీ వెడుతున్నాను.
ఎన్నో అనుభవాలు, భావోద్వేగాలతో నా మనసు నిండిపోయింది. నాలోనుంచి అవధులు లేని శక్తిప్రవాహం జరుగుతుండడాన్ని నేను అనుభూతి చెందుతున్నాను. 2024 లోక్‌సభ ఎన్నికలు అమృతకాలంలో జరుగుతున్న మొదటి ఎన్నికలు. కొద్దినెలల క్రితం మీరట్‌లో నేను ఎన్నికల ప్రచారం ప్రారంభించాను. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన ప్రదేశమది. అప్పటినుంచీ నేను మన గొప్ప దేశం నలుమూలలా ప్రయాణించాను. ఈ ఎన్నికల్లో చివరి ర్యాలీ కోసం నేను పంజాబ్‌లోని హోషియార్పూర్ వెళ్ళాను. సంత్ రవిదాస్ వంటి గొప్పగొప్ప గురువులను అందించిన నేల అది. అక్కడినుంచి నేను భారతమాత పాదమంజీరమైన కన్యాకుమారి వచ్చాను.
నా గుండెలోనూ, మనసులోనూ ఎన్నికల హడావుడి ప్రతిధ్వనిస్తుండడం సహజం. ఎన్నికల ప్రచార సభలు, రోడ్‌షోలలో చూసిన లక్షలాది ముఖాలు నా కళ్ళముందు కదలాడుతున్నాయి. మన నారీశక్తి ఆశీర్వాదాలు, వారి విశ్వాసం, అభిమానం… అదో అద్భుతమైన అనుభూతి. దాన్ని వినమ్రంగా స్వీకరించాను. వారి ప్రేమాభిమానాలకు నా కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉన్నాయి. చివరిగా నేను సాధనలోకి ప్రవేశించాను. ఎన్నికల ప్రక్రియ స్వభావమైన రాజకీయ చర్చలు, ఒక పక్షంపై మరోపక్షం మాటల దాడులూ ప్రతిదాడులూ, ఆరోపణలూ ప్రత్యారోపణలూ అన్నీ…. నేను సాధన మొదలుపెట్టాక నా మనసు నుంచి మాయమైపోయాయి. నాలో ఒక తటస్థ నిర్లిప్త వైఖరి పెరుగుతూ వచ్చింది. నా మనసు పూర్తిగా బాహ్య ప్రపంచం నుంచి వేరయిపోయింది.
అలాంటి బరువుబాధ్యతల మధ్య ధ్యానం చేయడం పెద్ద సవాలే. కానీ, వివేకానందస్వామికి ప్రేరణగా నిలిచిన కన్యాకుమారి గడ్డ దానిని సునాయాసమూ, సుసాధ్యమూ చేసింది. ఒక ఎంపీ అభ్యర్ధిగా నేను కాశీలో ప్రచారాన్ని నా ప్రియ విశ్వసనీయ వ్యక్తులకు అప్పగించి ఇలా వచ్చేసాను.
అలాంటి సంక్లిష్టమైన బాధ్యతల నడుమ, సాధనలో ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి. కానీ కన్యాకుమారి నేల, స్వామి వివేకానంద ప్రేరణ నా ప్రయత్నాన్ని సులభం చేసేసాయి. నేనే ఒక అభ్యర్ధిని అయినప్పటికీ కాశీలో నా ప్రచారాన్ని నా ప్రియమైన ప్రజల చేతిలో పెట్టేసాను.
బాల్యం నుంచీ ఇలాంటి విలువలను నాలో నింపినందుకు, వాటికి అనుగుణంగా జీవించేందుకు ప్రయత్నించేలా నన్ను ప్రోత్సహించినందుకూ దైవానికి ఋణపడి ఉంటాను. కన్యాకుమారిలో ఇదేచోట ధ్యానం చేసిన స్వామి వివేకానంద ఎలాంటి అనుభూతికి లోనై ఉండి ఉంటారో అని ఆలోచించాను. నా ధ్యానంలో కొంత భాగం అటువంటి ఆలోచనల పరంపరకే సరిపోయింది.
ఈ నిర్మమత్వం, ఈ మౌనం, ఈ నిశ్శబ్దం మధ్య నా మనస్సు నిరంతరాయంగా ఒక విషయం ఆలోచిస్తూనే ఉంది. అదే భారతదేశపు గొప్ప అభివృద్ధి. భారతదేశపు లక్ష్యాలు. కన్యాకుమారిలో సూర్యోదయం నా ఆలోచనలను కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళింది. విశాలమైన మహాసముద్రం నా ఆలోచనలను విస్తరింపజేసింది. విశ్వాంతరాళపు విస్తృతి నన్ను ఈ విశ్వపు ఐక్యతను, దాని గహనతనూ అవగతం చేసుకునేలా చేసింది. కొన్ని దశాబ్దాల క్రితం హిమాలయాల ఒడిలో ధ్యానం చేసినప్పటి నా అనుభవాలు, అనుభూతులు పునరుజ్జీవించినట్లయింది.
మిత్రులారా, కన్యాకుమారి నా మనసుకు ఎప్పుడూ దగ్గరే. కన్యాకుమారిలోని వివేకానంద శిలాస్మారకం ఏకనాథ్ రానడే నేతృత్వంలో నిర్మితమైంది. ఆయనతో కలిసి విస్తృతంగా ప్రయాణించే అవకాశం నాకు కలిగింది. ఈ శిలాస్మారకం నిర్మించే సమయంలో కన్యాకుమారిలో సైతం కొంత సమయం గడిపే అవకాశం నాకు దక్కింది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ… ప్రతీ భారతీయుడి హృదయంలోనూ నిగూఢంగా నిలిచిన గుర్తింపు అది. మాతా శక్తి కన్యాకుమారిగా అవతరించిన శక్తిపీఠం ఇది. దేశపు దక్షిణాగ్రమైన ఈ ప్రదేశం, దేశపు ఉత్తరాగ్రాన హిమాలయాల్లో నివసిస్తున్న శివ భగవానుడి కోసం పార్వతీమాత తపస్సు చేసిన స్థలం.
కన్యాకుమారి గొప్ప సంగమాల స్థలం. మన దేశంలోని పవిత్ర నదులు వివిధ సముద్రాలలో కలుస్తాయి. ఆ సముద్రాలు సంగమించే పవిత్ర ప్రదేశం కన్యాకుమారి. అంతేకాదు, భారతదేశపు సిద్ధాంతాలు సైతం సంగమించిన స్థలమిది. ఇక్కడ మనం వివేకానందుడి శిలా స్మారకాన్ని చూస్తాం. తిరువళ్ళువర్ గొప్ప విగ్రహాన్ని చూస్తాం. గాంధీ మండపం, కామరాజర్ మణిమండపం కూడా దర్శిస్తాం. ఆ మహానుభావుల ఆలోచనాధారలు సంగమించి ఒక జాతీయ భావధారగా ఏర్పడే గొప్ప ప్రదేశమిది. అందుకే ఈ ప్రదేశం, జాతి నిర్మాణానికి గొప్ప స్ఫూర్తి కలిగిస్తుంది. భారతదేశపు జాతీయత గురించి, ఐక్య భావన గురించీ సందేహాలున్న వారికి సైతం కన్యాకుమారి సమైక్య సందేశాన్నిస్తుంది.
కన్యాకుమారిలో తిరువళ్ళువర్ విగ్రహం సముద్రం నుంచి భారత మాత విస్తృతిని చూస్తున్నట్లు ఉంటుంది. ఆయన రాసిన తిరుక్కురళ్, అందమైన తమిళ భాషా సాహిత్యంలోని ఆభరణాలకు కిరీటం లాంటిది. మానవ జీవితంలోని ప్రతీ అంశం గురించీ అందులో ఉంది. అది మనకు మనగురించి, మన దేశం గురించి స్ఫూర్తి కలిగిస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తికి ప్రణామాలు అర్పించే అవకాశం రావడం నా అదృష్టం.
స్వామి వివేకానంద ఒకసారి ఒకమాట చెప్పారు, ‘ప్రతీ దేశానికీ అది ఇచ్చే ఒక సందేశం ఉంటుంది, నెరవేర్చవలసిన ఒక లక్ష్యం ఉంటుంది, చేరవలసిన ఒక విధి ఉంటుంది.’
అలాంటి అర్ధవంతమైన ప్రయోజనం దిశగా భారతదేశం వేలయేళ్ళుగా ప్రయాణిస్తోంది. భారత్ వేలయేళ్ళుగా ఎన్నో గొప్ప ఆలోచనలకు పురిటిగడ్డ. మనం సంపాదించుకున్నదాన్ని మన వ్యక్తిగత ఆస్తిగా ఏనాడూ భావించలేదు, దాన్ని భౌతికమైన లేక ఆర్థికమైన పరామితులతో మాత్రమే ఏనాడూ కొలవలేదు. అందుకే ‘ఇదం న మమ’ (ఇది నాది కాదు) అనే భావన భారతీయులకు సహమైన, అంతర్గతమైన లక్షణంగా ఉంది.
భారతదేశపు సంక్షేమం మన ప్రపంచపు పురోగతికి కూడా లాభదాయకమైనది. ఉదాహరణకు స్వతంత్ర సంగ్రామాన్నే చూద్దాం. భారతదేశం 1947 ఆగస్టు 15న స్వతంత్రమయింది. అప్పటికి ప్రపంచంలో ఎన్నో దేశాలు వలస పాలనలో ఉన్నాయి. స్వతంత్ర సాధన దిశగా భారతదేశ ప్రస్థానం అలాంటి ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది, వారూ స్వతంత్రం సాధించే దిశగా వారిని ప్రేరేపించింది. కొన్ని దశాబ్దాల తర్వాత, ప్రపంచం కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొన్నప్పుడు మళ్ళీ అదే స్ఫూర్తి కనిపించింది. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల గురించి ఆందోళనలు వ్యక్తమైనప్పుడు భారతదేశం చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి, ఎన్నో దేశాలకు ధైర్యాన్నిచ్చాయి, ఇక భారత్ ప్రత్యక్షంగా ఎన్నో దేశాలకు సహాయం చేసింది.
ఇవాళ భారతదేశపు పరిపాలనా నమూనా ప్రపంచంలో ఎన్నో దేశాలకు ఉదాహరణగా నిలిచింది. కేవలం పదేళ్ళ కాలంలో 25కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి పైకి తీసుకురావడం గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రజా అనుకూల సుపరిపాలన జిల్లా స్థాయిలో, మండలస్థాయిలో ప్రత్యేకమైన ఆశయాల వంటి సృజనాత్మక విధానాలు ఇవాళ ప్రపంచమంతా చర్చనీయాంశాలు అయ్యాయి. పేదలకు సాధికారత కలగజేసేందుకు మనం చేసిన ప్రయత్నాలు ప్రపంచానికి స్ఫూర్తి కలిగించాయి. మన దేశం ప్రారంభించిన డిజిటల్ ఇండియా ప్రచారం ఇప్పుడు మొత్తం ప్రపంచానికే ప్రేరణగా నిలిచింది. పేదవాడిని సాధికారత దిశగా నడపడంలో టెక్నాలజీని ఎలా వాడుకోగలం, దానిద్వారా పారదర్శకత ఎలా తీసుకురాగలం, ప్రజలకు వారి హక్కులను చేరవేయగలం అన్నది ప్రపంచ దేశాలకు సోదాహరణంగా తెలియజేసాం. భారతదేశంలో చౌకగా లభిస్తున్న డేటా, సామాజిక సమానత్వాన్ని తీసుకొచ్చే మార్గంగా నిలుస్తోంది. దానిద్వారా పేదలకు సమాచారం మాత్రమే కాదు, సేవలు కూడా చవగ్గా అందుతున్నాయి. టెక్నాలజీని ప్రజ్వామీకరించిన తీరును మొత్తం ప్రపంచం చూసింది, అధ్యయనం చేస్తోంది. మన దేశపు నమూనాను అనుసరించాలంటూ పెద్దపెద్ద సంస్థలు ప్రపంచ దేశాలకు సలహాలిస్తున్నాయి.
ఇవాళ భారతదేశపు అభివృద్ధి, పురోగతి కేవలం భారతదేశానికి మాత్రమే గొప్ప అవకాశం కాదు. ప్రపంచమంతటా ఉన్న మన భాగస్వామ్య దేశాలకు సైతం ఇదొక చారిత్రక అవకాశం. జి-20 విజయం తర్వాత భారతదేశం ప్రపంచంలో పెద్ద పాత్రను పోషించగలదు అని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. ‘గ్లోబల్ సౌత్’కు ఇవాళ భారతదేశం బలమైన, ప్రముఖమైన స్వరంగా నిలిచింది. భారత్ చొరవ వల్లనే జి-20లో ఆఫ్రికన్ యూనియన్ కూడా భాగస్వామి అయింది. అది ఆఫ్రికా దేశాల భవిష్యత్తుకు ఒక మేలి మలుపుగా నిలవనుంది.
మిత్రులారా, భారతదేశపు అభివృద్ధి పథం మనను గర్వంతోనూ, గొప్పదనంతోనూ నింపుతుంది. అదే సమయంలో అది మనకు 140 కోట్ల మంది పౌరుల బాధ్యతలను సైతం గుర్తు చేస్తుంది. ఉన్నతమైన విధులను, పెద్దవైన లక్ష్యాలనూ చేరుకోడానికి మనం ఒక్క క్షణమైనా వృధా చేయకుండా ముందడుగులు వేయాలి. మనం కొత్త కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి, ఆ కలల్లో జీవించాలి.
భారత్ అభివృద్ధిని మనం ప్రపంచం దృక్కోణం నుంచి చూడాలి. దానికోసం మనం భారతదేశపు అంతర్గత సామర్థ్యాలను అర్ధం చేసుకోవాలి. భారతదేశపు బలాలను గుర్తించాలి, వాటిని పోషించాలి, వాటిని ప్రపంచమంతటికీ లాభం కలిగించేందుకు ఉపయోగించాలి. ఇవాళ్టి ప్రపంచ పరిస్థితుల్లో యువ దేశంగా భారత్ బలం మనకు గొప్ప అవకాశం. దాన్నుంచి మం వెనక్కు తిరిగి చూడకూడదు.
21వ శతాబ్దపు ప్రపంచం ఎన్నో ఆశలతో భారత్ వైపు చూస్తోంది. ఈ ప్రపంచ పరిస్థితుల్లో ముందడుగు వేయడానికి మనం ఎన్నో మార్పులు చేసుకోవాలి. మన సంప్రదాయిక ఆలోచనా విధానాన్ని సంస్కరణల దిశగా మార్చుకోవాలి. భారత్ తనను తాను ఆర్థిక సంస్కరణలకు పరిమితం చేసుకోలేదు. జీవితంలోని ప్రతీ విషయంలోనూ సంస్కరణ దిశగా మనం ముందుకు నడవాలి. 2047 నాటికి వికసిత భారతాన్ని సాధించే దిశగా మన సంస్కరణలు ఉండాలి.
సంస్కరణలు ఏ దేశానికైనా ఏకదిశోన్ముఖంగా ఉండవని మనం అర్ధం చేసుకోవాలి. అందుకే నేను సంస్కరణ, పనితీరు, మార్పు అనే మూడింటితో కూడిన దృక్కోణాన్ని ప్రతిపాదిస్తున్నాను. సంస్కరణ బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది. దాని ఆధారంగా అధికార వ్యవస్థ పని చేయాలి. అందులో ప్రజలు కూడా భాగస్వాములుగా చేరినప్పుడు మార్పు చోటు చేసుకోడాన్ని మనం చూడగలం.
మన దేశాన్ని ‘వికసిత భారతం’గా మార్చడానికి శ్రేష్ఠతను మన ప్రాథమిక నియమంగా పెట్టుకోవాలి. వేగం, స్థాయి, అవకాశం, ప్రమాణాలు అనే నాలుగు దిశల్లో మనం త్వరగా పనిచేయాలి. ఉత్పత్తితో పాటు మనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలి. అప్పుడే మన లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలుగుతాము.
మిత్రులారా, భారత భూమి మీద జన్మించడం అనే అదృష్టంతో దైవం మనను ఆశీర్వదించినందుకు మనం గర్వపడాలి. భారతదేశానికి సేవ చేసేందుకు దైవం మనను ఎంచుకొన్నారని గుర్తించాలి. మన దేశం సర్వోత్కృష్టంగా ఎదిగే క్రమంలో మనవంతు పాత్ర పోషించాలి.
మన సంస్కృతిని, మన ఘన వారసత్వాన్నీ ఆధునిక పద్ధతిలో పునర్నిర్వచించుకోవాలి. ప్రాచీన విలువలను ఆధునిక సందర్భంలో అన్వయించుకుంటూ ఉండాలి.
ఒక దేశంగా మనం మన విశ్వాసాలనూ, పాతబడిపోయిన ఆలోచనలనూ పునర్మూల్యాంకనం చేసుకోవాలి. నిరాశనే వృత్తిగా చేసుకుని వెనక్కులాగే వారి నుంచి మన సమాజాన్ని విముక్తం చేసుకోవాలి. విజయాన్ని సాధించే దిశలో మొదటి మెట్టు ప్రతికూల ఆలోచనల నుంచి స్వాతంత్ర్యం పొందడమే అని గుర్తుంచుకోవాలి. సానుకూల ఆలోచనల నుంచే విజయం మొగ్గతొడుగుతుంది.
అనంతమైన, శాశ్వతమైన భారతదేశపు శక్తి గురించి నా విశ్వాసం, దానిపట్ల నా భక్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గత పదేళ్ళుగా భారతదేశపు ఆ సామర్థ్యం మరింత పెరగడాన్ని అందరికంటె ముందు నేను అనుభూతి చెందగలుగుతున్నాను.
20వ శతాబ్దపు నాలుగవ, ఐదవ దశాబ్దాలను మనం స్వాతంత్ర్య ఉద్యమం కోసం వినియోగించుకున్నాం. అలాగే 21వ శతాబ్దపు ఈ 25ఏళ్ళలోనూ వికసిత భారతానికి పునాది వేయాలి. స్వాతంత్ర్యోద్యమం గొప్ప త్యాగాలను కోరుకుంది. ప్రస్తుత సమయంలో దేశ ప్రజలందరినుంచీ గొప్పవైన, నిలకడ కలిగిన తోడ్పాటు కావాలి.
మనందరం మన దేశం కోసం వచ్చే 50 సంవత్సరాలూ మన జీవితాలను అంకితం చేయాలని స్వామి వివేకానంద 1897లో పిలుపునిచ్చారు. ఆయన ఆ పిలుపునిచ్చిన సరిగ్గా 50ఏళ్ళకు భారతదేశం 1947లో స్వాతంత్ర్యం ఆర్జించింది.
ఇవాళ మనకు మళ్ళీ అలాంటి సువర్ణావకాశం లభించింది. మనం వచ్చే 25 ఏళ్ళూ పూర్తిగా దేశం కోసం అంకితమవుదాం. మన ప్రయత్నాలు రాబోయే తరాలకు బలమైన పునాది వేస్తాయి, , రాబోయే శతాబ్దాల్లో భారత్‌ను కొత్త ఎత్తులకు తీసుకువెడతాయి. దేశ ప్రజల శక్తిసామర్థ్యాలనూ, కుతూహలాన్నీ చూస్తున్న నేను ఒక విషయం స్పష్టంగా చెప్పగలను. మన లక్ష్యం ఎంతో దూరం లేదు. మనం వేగంగా అడుగులు వేద్దాం. మనందరం కలసికట్టుగా పయనిద్దాం. దేశాన్ని వికసిత భారతంగా తీర్చిదిద్దుదాం.