ఈశాన్య భారతంలో నానాటికీ బలపడుతున్న భారతీయ జనతా పార్టీ తాజాగా జరిగిన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
పెమా ఖండూ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 60 స్థానాలకు పోటీ చేసి 46 స్థానాల్లో గెలిచింది. అందులో పది స్థానాలు ఏకగ్రీవంగా దక్కించుకున్నవి కావడం విశేషం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 41 సీట్లు దక్కించుకున్న బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో మరో 5 సీట్లు అదనంగా తన ఖాతాలో వేసుకోగలిగింది.
బీజేపీ మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాల్లో విజయం సాధించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3చోట్ల, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2చోట్ల గెలిచాయి. కాంగ్రెస్ ఒకే ఒక్క సీటుతో నామమాత్రపు ఉనికి నిలబెట్టుకుంది. 3 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు.
అరుణాచల్ ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేసారు. ‘‘అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు అండగా నిలిచారు. పార్టీ కార్యకర్తల నిర్విరామ కృషితోనే ఈ విజయం సాకారమైంది. మా ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం మరింత ఉత్సాహంగా, మరింత శక్తితో పనిచేస్తుంది’’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసారు.
అరుణాచల్‌లో బీజేపీ ఘనవిజయం వెనుక ముఖ్యమంత్రి పెమా ఖండూ కృషి ఉంది. ఆయన కాంగ్రెస్ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసి, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ మీదుగా బీజేపీలోకి ప్రయాణించారు. అరుణాచల్‌లోని రాజకీయ అస్థిర పరిస్థితులను ఎదుర్కొన్నారు. 2016 జులైలో మొదటిసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యారు. సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లోని 43మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకుని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌లో చేరారు. అయితే డిసెంబర్లో ఆ పార్టీ అధ్యక్షుడు తకమ్ పరియో పెమా ఖండూను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. ఈసారి ఖండూ 33మంది ఎమ్మెల్యేలను కూడగట్టి బీజేపీలో చేరారు. డిసెంబర్లో జరిగిన బలపరీక్షలో గెలిచి సీఎం పీఠం నిలబెట్టుకున్నారు. ఆ తరువాత రాష్ట్రంలో రాజకీయ సుస్థిరతను సాధించి ప్రజల మెప్పు పొందారు. 2019 అరుణాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని 41 సీట్లతో అధికారంలోకి తీసుకురాగలిగారు. తాజాగా 2024మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 46సీట్లతో పెమా ఖండూ నాయకత్వంలోని బీజేపీ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించగలిగింది.