తెలుగు రాష్ట్రాలకు పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ కు ఏపీతో బంధం తెగిపోయింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్‌ను పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి రాజధాని గడువు ఈ ఏడాది జూన్ 1తో ముగిసింది. హైదరాబాద్ ఇక నుంచి తెలంగాణకు శాశ్వత రాజధానిగా ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని ఉండటంతో పాటు ఆ ప్రాంతంలో పౌరుల ప్రాణ, ఆస్తి, రక్షణ, భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. ఇప్పుడీ గడువు ముగియడంతో ఇక నుంచి ప్రభుత్వమే శాంతిభద్రతలను చూసుకుంటుంది.
విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ విభజిత ఏపీ తొలి ముఖ్యమంత్రి గా ఎన్నికైన చంద్రబాబు, 2015లో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ జగన్, ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటన చేశారు. ఈ దఫా గెలిస్తే వైజాగ్ నుంచి పాలన అంటూ చెబుతున్నారు. ఎన్డీయే కూటమి మాత్రం అమరావతే ఆంధ్రలు రాజధాని పునరుద్ఘాటిస్తోంది.