పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ తమ దేశానికి చెందింది కాదని, అది విదేశీ భూభాగమని పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టుకు విన్నవించింది. పీవోకేలో పాకిస్థాన్ చట్టాలు చెల్లవని స్పష్టం చేసింది. ఇటీవల రావల్పిండిలో విలేకరి అహ్మద్ ఫర్హద్ షాను పాక్ నిఘా విభాగం ఐఎస్ఐ కిడ్నాప్ చేసింది. అహ్మద్‌ను విడుదల చేయాలంటూ ఆయన భార్య ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వాన్ని జడ్జి ఇరుకునపెట్టే ప్రశ్నలు వేశారు. దీంతో పీవోకే తమది కాదని, అక్కడ పాకిస్థాన్ చట్టాలు అమలు కావని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పీవోకే విదేశీ భూభాగమైతే పాక్ సైనికులు అక్కడ ఎందుకున్నారని ఇస్లామాబాద్ హైకోర్టు జడ్జి కయానీ ప్రశ్నించారు. విచారణ పేరుతో సామాన్యులను కిడ్నాప్ చేసి వేధించడాన్ని కోర్టు తప్పుపట్టింది. పీవోకే విదేశీ భూభాగమని పాకిస్థాన్ ప్రభుత్వం స్వయంగా వ్యాఖ్యలు చేయడంతో భారత వాదనకు బలం చేకూరినట్లైంది.