పాకిస్తాన్లో హిందూయువతిని ఎత్తుకుపోయి బలవంతంగా మతం మార్చిన మరో సంఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో బాధితురాలి పేరు శాంతి. బలవంతంగా మతం మార్చి ఆమెను ఫాతిమాను చేసారు.
2023 అక్టోబర్ చివరివారంలో శాంతిని కొంతమంది బలవంతంగా ఎత్తుకుపోయారు. కొన్నాళ్ళకు ఆమె ఒక ముస్లిం యువకుణ్ణి తన పూర్తి ఇష్టంతో పెళ్ళి చేసుకుందనీ, స్వచ్ఛందంగా మతం మారి ఫాతిమాగా పేరు మార్చుకుందనీ కథనాలు వెలువడ్డాయి.
స్వయంగా శాంతే న్యాయస్థానంలోనూ, బైటా కూడా తనంత తానే స్వచ్ఛందంగా తన కుటుంబం నుంచి విడిపోయి బైటకు వచ్చాననీ, ఇస్లాంలోకి మారాననీ చెప్పింది. కానీ తాజాగా ఆమె చెప్పిన మాటలు, పాత ప్రకటనలన్నీ అబద్ధాలని తేల్చేసాయి. తనను బలవంతంగా మతం మార్చారని శాంతి ఇప్పుడు చెబుతుండడం వివాదానికి దారి తీసింది.
శాంతి ఇస్లాంలోకి మారడం, ముస్లిం వ్యక్తిని పెళ్ళి చేసుకోడం న్యాయస్థానంలో రికార్డ్ అయింది. మత మార్పిడి, పెళ్ళికి సంబంధించి చట్టబద్ధమైన సర్టిఫికెట్లు కూడా మంజూరయ్యాయి. అప్పట్లో ఆమె ఫొటోలు, వీడియోలు చూస్తే ఆమె ఇష్టపూర్వకంగానే మతం మారి పెళ్ళిచేసుకుందన్న నమ్మకం కలిగించేలా ఉన్నాయి.
అయితే, ఎనిమిది నెలల తర్వాత అసలు నిజం వెలుగు చూసింది. శాంతి ప్రేమ పెళ్ళి చేసుకుని సుఖంగా బతుకుతుండడం అంతా ఉత్తమాట అని తేలిపోయింది. బలవంతపు మతమార్పిడి వ్యవహారమని బట్టబయలైంది. ఇది కేవలం శాంతి జీవితం గురించి మాత్రమే కాదు, పాకిస్తాన్లో ముస్లిములు మహిళలను, ప్రత్యేకించి హిందూ మహిళలను ఎంతలా బెదిరిస్తున్నారో, ఎలా ఎత్తుకుపోతున్నారో తెలియజెప్పే భయంకర విషాదం.
శాంతిని నజీర్ కుంభార్ అనే ముస్లిం యువకుడు తన ఇంటినుంచి కిడ్నాప్ చేసి తీసుకుపోయాడని, బలవంతంగా మతం మార్చి పెళ్ళి చేసుకున్నాడనీ, ఆమె తండ్రి మొదటినుంచీ ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చాడు. కానీ ఆయన వాదనను బైటకు రానీయకుండా తొక్కేసారు. ఇప్పుడు శాంతి అవే మాటలు చెబుతోంది.
ఈ కేసులో ఇంకొక ముఖ్యమైన విషయం, శాంతి వయసు గురించి తప్పుడు సమాచారం వ్యాపింపజేసారు. ఈ మొత్తం వ్యవహారం గురించి సరైన దర్యాప్తు జరగాలి. కానీ పాకిస్తాన్లో గతంలో జరిగిన ఇలాంటి కేసుల స్థితిగతులను పరిశీలిస్తే, నిందితుడికి న్యాయస్థానాల్లోనూ, ప్రభుత్వంలోనూ క్లీన్చిట్ రావడం, బాధితురాలి పరిస్థితి మరింత దిగజారిపోవడమే ఖాయమని అర్ధమవుతోంది.