బాలీవుడ్ అగ్రహీరోల్లొ ఒకరైన సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ భారీ స్కెచ్ వేసింది. సల్మాన్ కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచిన బిష్ణోయ్ గ్యాంగ్, అతడిని చుట్టుముట్టి కాల్పులు జరపాలని కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది.
సల్మాన్ ను అంతమొందించేందుకు గాను పాకిస్తాన్ నుంచి ఏకే 47 సహా పలు మారణఆయుధాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు తేల్చారు. పాక్ కు చెందిన ఓ ఆయుధాల డీలర్ నుంచి ఏకే 47, ఎం 16, ఏకే 92, హై క్యాలిబర్ ఆయుధాలను తెప్పించినట్లు తెలిపారు.
బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవల కాల్పులు జరిగాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. కాల్పుల ఘటన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని బిష్ణోయ్ గ్యాంగ్ లీడర్ లారెన్స్ బిష్ణోయ్ అప్పట్లో వార్నింగ్ ఇచ్చాడు.
కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇద్దరు అనుమానితులను ప్రశ్నించగా.. సల్మాన్ ను హత్య చేయడానికి బిష్ణోయ్ గ్యాంగ్ భారీ పథకం పన్నినట్లు తేలింది.ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ నివాసంతో పాటు పన్వేల్ లోని ఫాంహౌస్ వద్ద కాపు వేసినట్లు తెలిపారు. దాదాపు పాతిక మంది వరకు ఫాంహౌస్ సమీపంలో కాపు కాసినట్లు తేలింది.
‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా చిత్రీకరణ సమయంలో పలువురు నటులతో కలిసి సల్మాన్ ఖాన్, కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయనపై బిష్ణోయ్ గ్యాంగ్ కక్ష పెంచుకుంది. కృష్ణ జింకలను బిష్ణోయ్ తెగ దేవతా స్వరూపంగా పూజిస్తోంది. తమ విశ్వాసాలను గాయపరిచిన సల్మాన్ పై ప్రతీకారంలో భాగంగా భారీ దాడికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.