భారతదేశపు ఎన్నికల్లో గొప్పవిషయం ఏంటంటే…. ఓటర్లుండే ప్రాంతం ఎంత సంక్లిష్టమైన ప్రదేశం అయినా అక్కడ పోలింగ్ ఏర్పాట్లు జరుగుతాయి. ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అక్కడకు వెళ్ళి ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేలా చేస్తారు. అలాంటి ఒక ప్రత్యేకమైన పోలింగ్ స్టేషనే ఇది.
తాషిగాంగ్…. ప్రపంచంలోనే అతి ఎత్తయిన పోలింగ్ స్టేషన్‌గా రికార్డులకెక్కింది. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహుల్-స్పితి జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరు తాషిగాంగ్. హిమాలయాల ఒడిలోని ఆ గ్రామం భారత్-చైనా సరిహద్దులోని వాస్తవాధీనరేఖ దగ్గర ఉంది. ఇంకా, దాని ప్రత్యేకత ఏంటంటే… ఆ పల్లెటూరు సముద్రమట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. అంటే, ఎవరెస్ట్ శిఖరం ఎత్తులో దాదాపు సగం ఎత్తులో ఉందన్నమాట.
తాషిగాంగ్ గ్రామం మండీ లోక్‌సభా నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మండీ ఎంపీ సీటు మన దేశంలోనే రెండో
అతిపెద్ద నియోజకవర్గం. అక్కడ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా ప్రముఖ నటి కంగనా రనౌత్, కాంగ్రెస్ అభ్యర్ధిగా విక్రమాదిత్య సింగ్ తలపడుతున్నారు. తాషిగాంగ్, దానికి చేరువలోని మరికొన్ని గ్రామాలకు కలిపి ఒక పోలింగ్ స్టేషన్‌ను తాషిగాంగ్లో ఏర్పాటు చేసారు. అంటే అది ప్రపంచంలోనే అతి ఎత్తయిన పోలింగ్ స్టేషన్ అన్నమాట.
లాహుల్ స్పితి జిల్లా సబ్‌కలెక్టర్ కార్యాలయం కాజ అనే ప్రాంతంలో ఉంది. అక్కడ నుంచి ఎన్నికల సిబ్బంది తాషిగాంగ్ పోలింగ్ స్టేషన్‌కు వెళ్ళాలి. దానికి కాజ గ్రామం ఎదురుగా ఉన్న కొండ చుట్టూ తిరిగి గంటన్నర ప్రయాణం చేయాలి. అదేమంత సులభమైన ప్రయాణం కాదు. కొండ మీది కఠినమైన మార్గం, సన్నటి చీలికపేలికల్లా ఉండే మట్టిదారి, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీని వాతావరణంలో ప్రయాణం చేయడం చాలా సంక్లిష్టమైన ప్రయాస. అలాంటి చోటకు ఎంతో కష్టపడి వెళ్ళడానికి ఎంతమాత్రం బాధపడడం లేదు ఎన్నికల సిబ్బంది. అక్కడ జీవితాంతం గడుపుతున్న ప్రజలతో ఓటు వేయించడం తమకు గర్వకారణం అంటున్నారు.
తాషిగాంగ్లో పోలింగ్ స్టేషన్ పెట్టి అక్కడి ప్రజలకు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం ఇది నాలుగోసారి. ఇంతకీ, అక్కడి ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా….. 62.