మహారాష్ట్రలోని పుణె లో జరిగిన పోర్షే కారు ప్రమాదం విచారణలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి ప్రాణాలు తీసిన మైనర్ తల్లి కూడా అరెస్ట్ అయ్యారు. విచారణలో భాగంగా నిందితుడి రక్త నమూనాలు బదులుగా తనవి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలడంతో ఆమెను అరెస్టు చేశారు.
మే 19న 17 ఏళ్ళ వయస్సున టీనేజర్ ఫూటుగా మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడిపాడు. కారుతో ఇద్దరిని ఢీకొట్టడంతో వారు మరణించారు. రియల్టర్ అయిన మైనర్ తండ్రికి పలుకుబడి ఉండటంతో తన కొడుకును కేసు నుంచి తప్పించేందుకు నానా రకాల ప్రయత్నాలు చేశాడు. కారు నడిపింది డ్రైవర్ అని నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయారు. అలాగే ససూన్ ఆస్పత్రిలో తన కుమారుడి రక్త నమూనాలను కూడా మార్పించాడు. దాంతో ప్రమాదం జరిగినప్పుడు నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు సీసీ కెమెరాల్లో కనిపించినా.. బ్లడ్ రిపోర్టుల్లో మాత్రం అతను ఆల్కహాల్ తీసుకోనుట్లుగా తేలింది. విషయం బయటికి పొక్కడంతో బ్లడ్ శాంపిల్స్ మార్చిన ఇద్దరు డాక్టర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు
సాక్ష్యాలను తారుమారు చేసినందుకు గాను బాలుడి తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్, తాత సురేంద్ర అగర్వాల్ కూడా అరెస్టు అయ్యారు.