విజయవాడలో డయేరియా లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది. మొగల్రాజపురం, పాయకాపురంలో ఇప్పటికే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో వృద్ధుడు కూడా అతిసార లక్షణాలతో మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.
విజయవాడ నగరంలో గత ఐదు రోజుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా వారంతా వాంతులు విరేచనాలతో బాధపడినవారే. వందలాది మంది అతిసారతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. బాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించామని వైద్య సిబ్బంది చెబుతున్నప్పటికీ ఇంకా ఫలితాలు ప్రకటించలేదు.
వైద్య ఆరోగ్యశాఖ నుంచి సరైన సాయం అందడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కలుషితం కావడంతోనే డయేరియా ప్రబలినట్లు కొందరు చెబుతున్నారు.