శ్రీ హనుమాన్ స్వామి జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రామాలయాలు, హనుమ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. అంజనీపుత్రుడిని దర్శించుకుని మాలదారులు దీక్ష విరమణ చేస్తున్నారు. శ్రీరామ, హనమ నామస్మరణతో ఆలయ పరిసరాలు పరమపవిత్రంగా మారాయి.
తెలంగాణలో కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి భక్తులు దీక్ష విరమణకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
తిరుమలలో ఆకాశగంగ అంజనదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామికి ఉదయం అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామికి హనుమ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. జపాలి శ్రీ ఆంజనేయ స్వామికి వారికి టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
మైసూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద దత్తపీఠంలో ఆంజేయస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నేటి సాయంత్రం శోభాయాత్రలు నిర్వహించనున్నారు.