లోక్‌సభ ఎన్నికలకు ఏడవ, ఆఖరి దశ పోలింగ్ ఈ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని స్థానాలు సహా మొత్తం 57 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ ఇవాళ జరుగుతోంది.
ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. పంజాబ్‌లోని మొత్తం 13, హిమాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 4 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో 13, బెంగాల్‌లో 9, బిహార్‌లో 8, ఒడిషాలో 6, జార్ఖండ్‌లో 3, చండీగఢ్‌లో 1 నియోజకవర్గాలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది.
ఈ ఉదయం 9 గంటల సమయానికి 11.3శాతం పోలింగ్ నమోదయింది. పంజాబ్‌లో ఇండీ కూటమిలోని మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ పోటీ పడుతున్నాయి. 2020లో ఎన్డీయే కూటమి నుంచి శిరోమణి అకాలీదళ్ విడిపోవడంతో ఆ పార్టీ, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. మొత్తంమీద ఆ రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ ఉంది. అది ఎవరికి లాభిస్తుందన్నది చూడాలి.
ఒడిషాలో బీజేడీ-బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరు జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్-బీజేపీ ముఖాముఖీ తలపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోదీ పోటీ చేస్తున్న కాశీ స్థానంలో పోలింగ్ ఇవాళే జరుగుతోంది.
నేటి పోలింగ్‌లో ఉన్న ప్రముఖులు : బీజేపీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, మరో మంత్రి పంకజ్ చౌబే , ప్రముఖ సినీనటి కంగనా రనౌత్, భోజ్‌పురి నటుడు రవికిషన్ బరిలో ఉన్నారు. ఎన్డీయే కూటమికి చెందిన ఆర్ఎల్‌ఎం అధినేత ఉపేంద్ర కుశ్వాహా, అప్నాదళ్ సోనేవాల్ నేత అనుప్రియా పటేల్ కూడా నేటి పోటీలో ఉన్నారు.
ప్రతిపక్షాల విషయానికి వస్తే బెంగాల్ సూపర్ పీఎం అభిషేక్ బెనర్జీ(టిఎంసి) , బిహార్‌లో లాలూ కూతురు మీసాభారతి (ఆర్‌జెడి), జలంధర్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ బరిలో ఉన్నారు.
ఈ సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించుకోవచ్చని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఎగ్జిట్ పోల్స్‌ను కాంగ్రెస్ బహిష్కరించింది. ప్రతిపక్షం తమ అపజయాన్ని గుర్తించినందునే ఎగ్జిట్ పోల్స్‌ను బాయ్‌కాట్ చేసిందని బీజేపీ అగ్రనేత అమిత్ షా వ్యాఖ్యానించారు.
పార్లమెంటు లోక్‌సభతో పాటు రెండు రాష్ట్రాలు – ఆంధ్రప్రదేశ్, ఒడిషా శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలను జూన్ 4న కౌంట్ చేస్తారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసనసభల ఫలితాల కోసం ఆదివారం కౌంటింగ్ చేపడుతుంది.