కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ చేసిన ‘శత్రు భైరవీ యాగం’ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.తమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి,తనపై కొందరు కేరళలోని రాజరాజేశ్వరీ ఆలయంలో తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను కేరళ మంత్రి డా. ఆర్ బిందు తప్పుపట్టారు. తమ రాష్ట్రంలో అలాంటి పూజలు జరగవని చెప్పారు.
కేరళలోని రాజరాజేశ్వరి ఆలయంలో శత్రువుల్ని తొలగించేందుకు కర్ణాటకకు చెందిన కొందరు రాజకీయ నేతలు, అఘోరాల ద్వారా ‘శత్రు భైరవీ యాగం’ పేరిట పూజలు చేస్తున్నారని శివకుమార్ చెప్పారు. పూజల్లో భాగంగా పంచబలి కోసం దున్నలు, గొర్రెలు, పందులను బలిచ్చారని చెప్పారు. పూజలు ఇంకా కొనసాగుతున్నాయంటూ వ్యాఖ్యానించారు.
డీకే వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి బిందు…. దేశంలో కొన్నిచోట్ల సమాజాన్ని చీకటియుగం వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తమ రాష్ట్రంలో అలాంటివాటికి తావు లేదన్నారు. డీకేఎస్ ఆరోపణల నేపథ్యంలో కేరళలో ఇలాంటి పూజలు ఎక్కడైనా జరుగుతున్నాయో పరిశీలిస్తామన్నారు.