బంగారం స్మగ్లింగ్‌కు విమాన సిబ్బందే పాల్పడుతోన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 18న మస్కట్ నుంచి కేరళలోని కన్నూర్ వస్తోన్న విమానంలో బంగారం స్మగ్లింగ్ అవుతోందంటూ డీఆర్ఐ అధికారులకు అందిన సమాచారంతో రంగంలోకి దిగారు. ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తోన్న సురభి ఖాతూన్‌ను తనిఖీ చేయగా ఆమె మలద్వారంలో 960 గ్రాముల బంగారం బయటపడింది. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ఆమెను జైలుకు తరలించారు. ఎయిర్‌హోస్టెస్ మలద్వారంలో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని డీఆర్ఐ అధికారులు చెపుతున్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటోన్నా బంగారం స్మగ్లింగ్ ఆగడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో 360 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి రోజు దేశంలో ఏదొక విమానాశ్రయంలో ఇలాంటి కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.