రికార్డు స్థాయిలో పెరిగిపోయిన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతోన్న ఢిల్లీ ప్రజలకు గుక్కెడు నీరు కూడా దొరకడం లేదు. పెరిగిన ఎండలకు సరిపడా నీరు సరఫరా చేయలేక ఢిల్లీ ప్రభుత్వం చేతులెత్తేసింది. అదనపు నీరు కేటాయించేలా హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించాలని ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఢిల్లీలో 3 కోట్ల జనాభాకు సరిపడా నీరు సరఫరా చేయడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సగటున 2.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదవుతున్నాయి. బుధవారంనాడు ఢిల్లీలో 52.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడచిన పదేళ్లలో ఇదే అత్యధికం. సగటుకన్నా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. రాబోయే కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మరో వైపు విద్యుత్ డిమాండ్ 8 వేల మెగావాట్లు దాటిపోయింది. విద్యుత్ కోతలు కూడా ఢిల్లీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.