చైనా యుద్ధ వ్యూహాలు భారత్‌ను కలవరపరుస్తున్నాయి. తాజాగా చైనా ఆక్రమిత టిబెట్‌లో సిక్కింకు కేవలం 150 కి.మీ దూరంలోని షిగాట్సే విమానాశ్రయంలో అత్యాధునిక జే 20 స్టెల్త్ ఫైటర్ జెట్లు మోహరించినట్లు, ఆల్ సోర్స్ ఎనాలిసిస్ అనుమతితో జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ విడుదల చేసి ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఏటా ఈ సంస్థ ఉపగ్రహ చిత్రాలను విడుదల చేస్తుంది.
టిబెట్‌లోని షిగాట్సే విమానాశ్రయంలో ఆరు జే 20 స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రెండో అతిపెద్ద విమానాశ్రయం. ఇది సముద్ర మట్టానికి 12408 అడుగుల ఎత్తులో ఉంది. ఈ విమానాశ్రయంలో కేజే 500 ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా బయటపడింది.
టిబెట్‌లోని షిగాట్సే విమానాశ్రయం అటు ప్రయాణీకులకు, సైనిక అవసరాలకు చైనా ఉపయోగిస్తోంది. ఇది పశ్చిమబెంగాల్లోని హరిమారాకు 290 కి.మీ దూరంలో ఉంది. భారత్ అత్యాధునిక యుద్ధ విమానాలైన రాఫెల్‌ను రంగంలోకి దింపడంతో చైనా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.