నైరుతి రుతుపవనాలు దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాయి. గురువారం ఉదయం కేరళను నైరుతి రుతుపవనాలు తాకినట్లు వాతావరణ విభాగం తెలిపింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది.
వర్షపాతంతోనే భారత్ లో 52 శాతం భూమి సాగు అవుతుంది. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40 శాతం దిగుబడి వస్తుండగా భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాల పాత్ర కీలకం.
లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడడం మరో మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున గతం కంటే ఈ ఏడాది వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
1951 నుంచి 2023 వరకు ఎల్నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్లో తొమ్మిదిసార్లు అధిక వానలుపడినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.